ఏడాది వరకు పబ్లిక్ మీటింగ్ లు ఉండకపోవచ్చు

దేశంలో రాష్ట్రాలు, కేంద్రం కరోనాపై ఐక్యంగా పోరాడుతున్నాయని తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. ఒక్క పశ్చిమ బెంగల్ మినహా అన్ని రాష్ట్రాలు, అందరూ ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన క్లాప్స్, లైటింగ్ ల్యాంప్ కు దేశ ప్రజలంతా స్పందించారన్నారు. మనం కరోనాపై పోరాటంలో ఒక్కతాటిపై ఉన్నామనడానికి ఇదే నిదర్శనం అన్నారు. దేశంలో మరో ఏడాది వరకు పబ్లిక్ మీటింగ్ లు ఉండకపోవచ్చని.. జూన్ వరకు కూడ దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందన్నారు. మే -3 తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.

అప్పటి పరిస్థితిని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న ముర‌ళీధ‌ర్ రావు.. శుక్ర‌వారం ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులతో మాట్లాడుతారన్నారు. శనివారం ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడుతారని..స్కూళ్ళు, కాలేజీలు జూన్ తరువాత ఎలా నడిపించాలనే అంశంపై సీరియస్ చర్చ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుంటుందని.. ఇప్పటి వరకు ఉన్న క్లాస్ రూమ్ సిస్టం భవిష్యత్తులో ఉండకపోవచ్చన్నారు. ప్రతి క్లాస్ లో విద్యార్దుల సంఖ్య తగ్గించే విధంగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని తెలిపారు ముర‌ళీధ‌ర్ రావు.

Latest Updates