కారు షెడ్డు పీకేస్తం..మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తం: ఎంపీ బండి సంజయ్

‘సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​యాక్ట్​ (సీఏఏ)’పై టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఓటు బ్యాంకు కోసం ముస్లింలను భయపెడుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​సింగ్​ ఠాకూర్, ఎంపీ బండి సంజయ్​అన్నారు. వివక్షకు గురవుతున్న వారిని అక్కున చేర్చుకునే సదుద్దేశంతో చేసిన చట్టంపై అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. ఎంఐఎం పతంగి దారం తెంపుతామని, టీఆర్ఎస్​ కారు షెడ్డును పీకేస్తామని కామెంట్​ చేశారు. సీఏఏపై అవగాహన కల్పించడం, దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవారిని ఎండగట్టడం లక్ష్యంగా బీజేపీ కరీంనగర్​లో మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది.

గీతాభవన్​ చౌరస్తా నుంచి కలెక్టరేట్​ వరకు బీజేపీ, జాతీయ జెండాలతో ర్యాలీ జరిపారు. తర్వాత సభ నిర్వహించారు. కేంద్ర మంత్రి అను రాగ్​ఠాకూర్, ఎంపీ బండి సంజయ్, బీజేపీ నేతలు పెద్దిరెడ్డి, బొడిగె శోభ, సుద్దాల దేవయ్యతోపాటు పెద్ద సంఖ్యలో నేతలు, బీజేపీ, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. సభలో అనురాగ్​ఠాకూర్, బండి సంజయ్ ​ప్రసంగించారు, తర్వాత ప్రెస్​మీట్లోనూ మాట్లాడారు.

ఓర్వలేకనే ఆరోపణలు

ప్రధాని మోడీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అనురాగ్​ ఠాకూర్​ మండిపడ్డారు. దేశంలోని ముస్లింలు ఇక్కడే ఉంటారని, ఇతర దేశాల్లో నివసించే భారతీయులను మన దేశానికి తీసుకురావాలని మోడీ సంకల్పించారని చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో మైనార్టీలపై హింసను ఏనాడూ ప్రశ్నించని ఎంఐఎం.. ఆ దేశాల నుంచి భారత్ కు వచ్చే శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. దేశ విభజన టైంలో 9 శాతంగా ఉన్న ముస్లింలు ఇప్పుడు 14 శాతానికి చేరారని.. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్​లలో 23 శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు 3 శాతానికి తగ్గిపోయారని గుర్తు చేశారు. నాగరికతను నేర్పడం కోసమే ఈ చట్టమని, మహాత్మాగాంధీ, నెహ్రూ కూడా అప్పట్లో ఇవే అంశాలను చెప్పారని పేర్కొన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒకటేనని ఆరోపించారు. బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్న తెలంగాణలో కార్యకర్తలంతా అంకుఠిత దీక్షతో నాలుగు ఎంపీ స్థానాలు గెలిపించారన్నారు. బీజేపీ ఎంపీలు పట్టుబట్టి మరీ ఇక్కడి పనులు చేయించుకుంటున్నారన్నారు.

మా సత్తా చూపిస్తం..

మున్సిపల్​ ఎలక్షన్లలో బీజేపీ సత్తా చూపిస్తామని ఎంపీ బండి సంజయ్‍కుమార్‍ అన్నారు. ఎంఐఎం పతంగి దారం తెంపుతామని, ఇప్పటికే పంక్చరైన టీఆర్‍ఎస్‍ కారు షెడ్డును పీకేస్తామని కామెంట్​ చేశారు. కారు డబ్బుతోనే పతంగి ఎగురుతోందన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‍, అసదుద్దీన్‍ ఒవైసీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని.. జనంలో ఐక్యతను దెబ్బతీసేందుకు, మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా రానున్న రోజుల్లో ఎన్‍ఆర్‍సీని కూడా తీసుకువస్తామన్నారు. టీఆర్ఎస్​ కారు స్టీరింగ్​ ఎంఐఎం చేతిలో ఉందని సంజయ్​ అన్నారు. టీఆర్‍ఎస్‍కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని.. బీజేపీకి ఓటు వేయాలని, దేశంలో ఉగ్రవాదులకు స్థానం లేదని నిరూపించాలని చెప్పారు. అవకాశమిస్తే 15 నిమిషాల్లో హిందూయిజం లేకుండా చేస్తానన్న ఒవైసీతో జతకట్టిన కేసీఆర్​ తాము సెక్యులర్​ అని చెప్పుకోవడాన్ని ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. సీఏఏకు మద్దతుగా బీజేపీ నిర్వహిస్తున్న ర్యాలీలకు భయపడే కేసీఆర్​ కరీంనగర్​కు వచ్చాడన్నారు.

Latest Updates