మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు: బీజేపీని ఆహ్వానించిన గవర్నర్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు గవర్నర్ భగత్ సింగ్ కొషియారి. సోమవారం బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్నందునే బీజేపీని ఆహ్వానించినట్లు రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా.. మిత్రపక్షాలుగా పోటీ చేసిన బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపొందాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది శాసన సభ్యుల మద్దతు కావాలి.

అయితే సీఎం పదవికి ఫిఫ్టి- ఫిఫ్టి ఫార్మూలా అమలు చేయాలని శివసేన పట్టుబట్టింది. రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. బీజేపీతో చర్చలంటూ జరిగితే ముఖ్యమంత్రి పదవిపైనేనని శివసేన నేతలు చెప్పడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా చెప్పారు సంజయ్ రౌత్. శివసేన తీరుపై దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మాతో చర్చించాల్సిన సమయంలో కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చలు జరిపిందని ఆరోపించారు.

బీజేపీతో చర్చలు జరపబోమని ఉద్దవ్ థాకరే కూడా ప్రకటించారు. శివసేన ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించారు. అటు ఎన్సీపీ, కాంగ్రెస్ మాత్రం తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తెలిపాయి. దీంతో గవర్నర్ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించడం ఆసక్తిగా మారింది. బల నిరూపణకు బీజేపీ వ్యూహం ఏంటనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కల్గిస్తోంది.

Latest Updates