హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమైతున్నది. ఇందుకోసం గ్రౌండ్ లెవెల్ నుంచి కేడర్‌ను ప్రిపేర్ చేస్తున్నది. బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34,600 బూత్ కమిటీలకు చెందిన 7.26 లక్షల మంది బీజేపీ బూత్ కమిటీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేడర్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వీడియో సందేశం పంపారు. పార్టీలో పోలింగ్ బూత్ అధ్యక్షులు, సభ్యులే కీలకమని, పార్టీ విస్తరణలో వారి కృషి ఎంతో ఉందని చెప్పారు. ‘‘ఈ పార్టీలో మీరింత మంది ఉన్నారు. ఇందులో మీ బంధువులు ఒక్కరైనా ఉన్నారా.. ఇతర పార్టీల్లో అలా కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో నడిచే పార్టీలవి. అందులో కార్యకర్తలకు స్థానం ఉండదు. వారి తర్వాత వారి కుటుంబ సభ్యులే కీలక పదవుల్లో ఉంటారు. కానీ బీజేపీలో బూత్ స్థాయి కార్యకర్త కూడా రాబోయే రోజుల్లో పార్టీలో కీలక స్థానంలో ఉండొచ్చు. కార్యకర్తలను గుర్తించే పార్టీ బీజేపీ ఒక్కటే’’ అని ఆయన చెప్పారు.
నిజానికి ఈ కార్యక్రమంలో నడ్డా వర్చువల్‌గా మాట్లాడాల్సి ఉంది. కానీ టెక్నికల్ సమస్యలతో అది సాధ్యపడలేదు. దీంతో రికార్డు చేసిన నడ్డా వీడియో స్పీచ్ ను సమ్మేళనం ప్రారంభోత్సం సందర్భంగా అన్ని బూత్ కమిటీల కార్యకర్తలకు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ కమిటీల సమ్మేళనంలో సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముషీరాబాద్‌లో ఎంపీ లక్ష్మణ్, ధర్మపురిలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, గద్వాలలో డీకే అరుణ, మెదక్ లో ధర్మపురి అర్వింద్, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుబ్బాకలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ‘సరళ’ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ పని చేసే తీరు గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వర్చువల్‌గా బూత్ కమిటీ సభ్యులకు వివరించారు. తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి సంజయ్ మాట్లాడారు. బూత్ కమిటీల సమ్మేళనంతో రాష్ట్రంలో బీజేపీ బలమెంతో తెలిసిపోతున్నదని చెప్పారు.
కేంద్ర నిధులపై బీఆర్‌ఎస్ డ్రామాలు: సంజయ్
‘‘రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారానే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుంది” అని సంజయ్ చెప్పారు. ఓటర్ లిస్టులో బీజేపీ కార్యకర్తల ఓట్లు తీసివేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉంటూ ఓటర్ లిస్టులో తమ పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలని సూచించారు. గతంలో ప్రధాని మోడీ కూడా పోలింగ్ బూత్‌కు అధ్యక్షుడిగా పనిచేశారని, పోలింగ్ బూత్‌ల ప్రాధాన్యాన్ని మోడీ పలు సందర్భాల్లో గుర్తు చేశారని వివరించారు. పార్టీకి మూల స్థంభాలు పోలింగ్ బూత్ కమిటీలేనని చెప్పారు. ‘‘ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర నిధులపై బీఆర్‌ఎస్ డ్రామాలాడుతున్నది. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో ఆధారాలతో సహా చర్చించేందుకు మేం రెడీగా ఉన్నాం. మీ అయ్యను రాజీనామా పత్రం తీసుకొని రమ్మను” అని మంత్రి కేటీఆర్‌కు సంజయ్ సవాల్ విసిరారు. లిక్కర్‌పై వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని, మరి ప్రజలు కడుతున్న పన్నులు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, హరితహారం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం బీఆర్ఎస్ సర్కార్ ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతుబంధు డబ్బులను బ్యాంకులు బకాయి కింద జమ చేసుకుంటున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో మార్పు రావాలి: కిషన్‌రెడ్డి
‘‘ఒకాయన రాజీనామా చేస్తానని మాట్లాడుతున్నారు.. మీ రాజీనామా ఎవరికి కావాలి? నువ్వు ఉంటే ఏంటి? పోతే ఏంటి? నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు మరో ఆరు నెలల్లో మీతో రాజీనామా చేయిస్తారు. అప్పుడు ఫామ్ హౌస్ కే మిమ్మల్ని పరిమితం చేస్తారు. మీ రాజకీయం అందరికీ తెలుసు. తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిన మీరు.. రాజీనామా సవాళ్లు విసరాల్సిన పనిలేదు” అని మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బూత్ కమిటీల సమ్మేళనంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన పాల్గొన్నారు. ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజమే.. మీ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేసి ఓడిస్తారు.. మేం ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల కోసం పోరాటం చేస్తాం” అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారని, ఆయన్ను తిడితే సూర్యుడి మీద ఉమ్మేసినట్లేనని చెప్పారు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రజలకు సమాధానం చెప్పాలి
‘‘ఎంతో కష్టపడి, బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రం.. ఈ రోజు అవినీతి కుటుంబం వద్ద బందీ అయింది. ఓ నియంతృత్వ ఆలోచన కింద తెలంగాణ నలిగిపోతున్నది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలు కావాలి” అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి కేసీఆర్.. మొదట వెన్నుపోటు పోడిచింది దళిత సమాజాన్ని కాదా అని ప్రశ్నించారు. ‘‘రుణ మాఫీ చేస్తానన్నారు. దళిత బంధు ఇస్తానన్నారు. ఏ ఒక్క మాటపై నిలబడలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎందుకు ఇవ్వడం లేదు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. ఎందుకు తెరిపించలేదు? తెలంగాణ సమాజం అడిగిన ప్రజలకు సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో వందల ఎకరాల్లో బీఆర్ఎస్ నాయకులు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న డబ్బు కర్నాటక, తమిళనాడు, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్‌లోని పార్టీలకు ఇచ్చి బీఆర్ఎస్ లో చేరమంటున్నారని, అది తెలంగాణ డబ్బు అని అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ పేరుతో రేషన్ కార్డు ఇచ్చే సోయి ఎందుకు లేకపోయిందని ప్రశ్నించారు. ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ కమిటీని పూర్తిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
హిందూ దేవుళ్లను కించపరిస్తే ఎందుకు స్పందించరు?
‘‘అయ్యప్ప స్వామిని, శ్రీరాముడిని కించపరిచే కుట్ర జరుగుతున్నది. సరస్వతి అమ్మవారిని కించపరిచినా.. మనం అనుకున్న స్థాయిలో సర్కారు స్పందించ లేదు. హిందూ దేవుళ్లను కించపరిస్తే సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ నేతల నోళ్లు ఏమైపోయాయి” అని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ ఏ మతాన్ని కించపరచలేదని, హిందూ మతాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని, పేదల కోసం పోరాడాలని, ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘పేదల కోసం బీజేపీ అధికారంలోకి రావాలి. రజాకార్ల రాజ్యానికి చరమగీతం పాడదాం..రామ రాజ్యాన్ని స్థాపిద్దాం” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘6359119119 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.. బీజేపీకి మద్దతు తెలపండి’ అని ప్రజలను కోరారు.
నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు ఇచ్చిందే తప్ప ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు. లక్షా 91 వేల ఖాళీలున్నా.. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నది. మళ్లీ కోర్టులకు వెళ్లి ఉద్యోగాలు భర్తీ కాకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నది” అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ‘‘దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ నేతల వ్యవహారం. వాళ్ల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి ఏండ్లు గడిచినా ఇన్నాళ్లూ నోరు మెదపని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయి. వాస్తవాలు తెలియడంతో.. దారి మళ్లించేందుకే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు పేరుతో డ్రామాలాడుతున్నారు” అని ఆరోపించారు.
త్వరలో శాశ్వతంగా ఫ్రీ రేషన్
త్వరలో కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా ఉచిత రేషన్‌ను దేశమంతా ఇవ్వబోతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. దీనిపై కేంద్ర కేబినెట్‌లో ఇప్పటికే చర్చించామని తెలిపారు. సీతాఫల్ మండీలో మాట్లాడిన ఆయన.. కేంద్రం కిలో బియ్యంపై రూ.30 ఖర్చు చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 ఖర్చుపెట్టి అంతా తామే చేస్తున్నామని చెప్పుకుంటున్నదని విమర్శించారు.
