కేంద్ర నేతలు ప్రచారం చేస్తే తప్పా?.. కేటీఆర్ నువ్వు ఇమ్రాన్ ఖాన్‌‌ను తెచ్చుకో

హైదరాబాద్: గ్రేటర్ ఓటర్లు కేటీఆర్‌‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాజ్‌‌భవన్‌‌లో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డితో కలసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను లక్ష్మణ్ కలిశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ సమీక్ష, డీజీపీ ప్రెస్ మీట్ వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని బీజేపీ నేతలు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీలు వ్యవహరిస్తున్న తీరు సరికాదని లక్ష్మణ్ అన్నారు.

‘బీజేపీ ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న అనూహ్య మద్దతును కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర నాయకులు కూడా బరిలో దిగుతున్నారనేసరికి గజగజ వణికిపోతున్నారు. అందుకే జాతీయ నాయకుల ప్రచారాన్ని తప్పుబడుతూ.. కేటీఆర్ తన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులు ప్రచారానికి వస్తే.. కేటీఆర్‌‌కు అభ్యంతరం ఎందుకో? గ్రేటర్ అభివృద్ధిపై జాతీయ నేతలతో ప్రజలకు భరోసా ఇప్పిస్తే తప్పేంటి? మీరు కూడా మీ మజ్లిస్  పార్టీతో కలసి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌ను తీసుకొచ్చి ప్రచారం చేయించండి. కావాలంటే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోనో, జిహాదీ ఉగ్రవాది అజర్ మసూద్‌‌ను తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేయించుకోండి. ఏమో.. నిజంగా వారితోనూ ప్రచారం చేయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎంఐఎంతో లోపాయికారీ పొత్తు కొనసాగిస్తూనే.. పైకి మాత్రం పొత్తు లేదనడం టీఆర్ఎస్‌‌ నేతలో నెలకొన్న భయానికి అద్దం పడుతోంది’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Latest Updates