టీఆర్ఎస్ ప్రభుత్వం.. బీసీలకు వ్యతిరేకం

  • బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్
  • కాంగ్రెస్ దశాబ్దాలుగా బీసీలకు చేసిందేమీ లేదు 
  • బలహీనవర్గాలకు బీజేపీనే అసలైన అండ 
  • మోడీ స్కీంలు, పాలసీలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రకటన 
  • ఢిల్లీలో ఓబీసీ మోర్చా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్.. పార్టీ అగ్రనేతల గ్రీటింగ్స్

న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక సర్కార్ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. ఆ పార్టీ బలహీనవర్గాలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలను జనంలో ఎండగడతామన్నారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్డాఫీస్ లో ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా లక్ష్మణ్​ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ​మీడియాతో మాట్లాడారు. బీజేపీలో 2015లో ఓబీసీ మోర్చా ప్రారంభమైందని, తాను 7వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు.

బీసీలకు టీఆర్ఎస్ అన్యాయం

ముస్లింలను బీసీల జాబితాలో చేర్చిన కేసీఆర్ ప్రభుత్వం.. బీసీల వాటాను కాజేస్తోందని లక్ష్మణ్ మండిపడ్డారు. హైదరాబాద్, మున్సిపల్ కార్పొరేషన్లలో మజ్లిస్ బీసీల పేరుతో రిజర్వేషన్లు తన్నుకుపోతుంటే కేసీఆర్ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కారు 17 ఫెడరేషన్లను ఏర్పాటు చేసిందని, ఒక్క ఫెడరేషన్ చైర్మన్ కు కూడా ఫ్యాన్ గానీ, ప్యూన్ గానీ లేడన్నారు. కులాల పేరుతో భవనాలు అని ఒక్కటీ కట్టలేదన్నారు. ఎంబీసీ జాబితా అని చెప్పిన సీఎం.. ఆరేళ్లయినా అందులో ఏ కులాలు ఉంటాయో చెప్పడం లేదని విమర్శించారు. బీసీలకు నేషనల్ బీసీ కార్పొరేషన్ల నిధులను ఖర్చు చేయడం తప్ప రాష్ట్రం నుంచి ఒక్క రూపాయీ ఇవ్వడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఫీజు రీయింబర్స్ మెంట్, మినహాయింపులు ఇవ్వడం మంచిదేనని, బీసీలపై ఆంక్షలు విధించడాన్ని సహించబోమన్నారు. 10 వేలలోపు ర్యాంకు వస్తేనే ఫీజు రీయింబర్స్ మెంట్ అంటూ.. బీసీలకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందన్నారు.

బీసీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు 

బీజేపీకి బలహీనవర్గాలను చేరువ చేయడమే తన లక్ష్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం తొలుత బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందని, వారి కోసం చేసిందేమీ లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం తొలిసారి కాకా కలేల్కర్ కమిషన్1955లో నివేదిక ఇస్తే.. దానిని అప్పటి ప్రధాని నెహ్రూ, తర్వాత ఇందిర, రాజీవ్ గాంధీ పట్టించుకోలేదన్నారు. 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనసంఘ్ తొలిసారి బీసీల స్థితిగతులపై మండల్ కమిషన్ తో వారికి న్యాయం చేయాలని ఆలోచించిందన్నారు. కానీ 40 ఏండ్లయినా ఆ కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు27 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు.

బలహీనవర్గాలకు అండగా బీజేపీ

బలహీనవర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, పాలసీలను అమలు చేస్తోందని లక్ష్మణ్​చెప్పారు. ప్రధాని మోడీ చేపట్టిన స్కీంలపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. మోడీ తెచ్చిన ప్రధాన మంత్రి సురక్ష బీమా, పీఎం జీవన్ జ్యోతి, పీఎం ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ యోజనతో బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. గత ఆరేళ్లలో చేతివృత్తులు, బీసీల హక్కుల కోసం మోడీ సర్కార్ పలు కమిషన్లను ఏర్పాటు చేసిందని లక్ష్మణ్ చెప్పారు. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిందని గుర్తుచేశారు.

మోడీ సభకు ఇంచార్జ్ గా..

బీహార్ ఎన్నికల్లో మోడీ బహిరంగ సభకు తనకు ఇంచార్జ్ బాధ్యతలను హైకమాండ్ అప్పగించిందని లక్ష్మణ్ చెప్పారు. కరోనా రూల్స్‌ను  అనుసరించి.. పెద్ద స్క్రీన్లు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా గ్రామ గ్రామానికీ మోడీ స్పీచ్ ను తీసుకెళ్తామన్నారు.

లక్ష్మణ్ కు పార్టీ నేతల అభినందనలు..

ఓబీసీ మోర్చా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ కు బీజేపీ అగ్రనేతలు అభినందనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో గ్రీటింగ్స్ చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, ఎంపీలు ధర్మపురి అర్వింద్, జీవీఎల్ నర్సింహారావు, ఇతర నేతలు విషెస్ చెప్పారు. రాష్ట్రం నుంచి పార్టీలో జాతీయ స్థాయిలో ఇద్దరికి బాధ్యతలు అప్పగించారని, తాము కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెస్తామని డీకే అరుణ చెప్పారు.

కేటీఆర్​.. పద్ధతులు తెలుసుకో: కిషన్​రెడ్డి

విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం సాయమందించే విషయంలో కొన్ని పద్ధతులుంటాయని, మంత్రిగా కేటీఆర్​ వాటిని తెలుసుకుంటే మంచిదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ వరదల విషయంలో కేంద్ర సాయంపై కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. విపత్తు నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన తర్వాత కేంద్ర బృందం రాష్ట్రంలో వరద ప్రాంతాల్లో పర్యటించి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత కేంద్రం సాయమందిస్తుందని చెప్పారు. అంతకన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న స్టేట్​ డిజాస్టర్​ ఫండ్​ నుంచి ఖర్చు చేయాలన్నారు. మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్పే కేసీఆర్​.. ముందు తాత్కాలికంగా రాష్ట్ర ఖజానా నుంచి వరద బాధితులకు సాయం చేయాలన్నారు.

Latest Updates