రామయ్య కోవెలకు తొవ్వ చూపిన రథయాత్ర

30 ఏళ్లకిందట బీజేపీ నేత ఎల్ కే అద్వానీ ఉద్యమం
సోమనాథ ఆలయం నుంచి అయోధ్యకు యాత్ర్ర
అద్వానీని బీహార్ ప్రభుత్వం అరెస్టు చేసినా యాత్ర ఆగలే
అయోధ్యకు కరసేవకులు

పాట్నా: ఎన్నో పోరాటాలు.. మరెన్నో త్యాగాలు..ఇంకెన్నో ఎదురుచూపుల తర్వాత రామ మందిర నిర్మాణ కల సాకారం కాబోతోంది. ఇవాళ ఆలయ నిర్మాణానికి పునాది రాయి పడుతోంది. కానీ గుడి కోసం అడుగులు పడింది ఇప్పుడు కాదు.. రామజన్మభూమి వైపుగా రథం సాగింది ఈనాడు కాదు.. దాదాపు 30 ఏండ్ల కిందట. లాల్ కృష్ణ అద్వానీ అప్పుడు నాటిన విత్తనం.. ఇప్పుడు మొలకెత్తుతోంది. ఆయన రథయాత్ర.. రామమందిరానికి తొవ్వ చూపింది. సోమనాథ్ ఆలయం నుంచి మొదలు.. ఎల్ కే అద్వానీ జీవితాన్నే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పినది అయోధ్య రథయాత్ర. అప్పుడు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్న అద్వానీ..సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేయనున్నట్లు 1990 సెప్టెంబర్ 12న ప్రకటించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన1990 సెప్టెంబర్ 25న యాత్ర ప్రారంభమైంది. అయోధ్యలో రామ మందిరాన్నినిర్మించేందుకు ప్రజల మద్దతు పొందడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగింది. 10,000 కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్లాన్ చేశారు.

వందల గ్రామాలు.. వేల కిలోమీటర్లు

వందలాది గ్రామాలు, పట్టణాల మీదుగా అద్వానీ పర్యటన సాగింది. ఈ యాత్రలో వేల సంఖ్యలో కర సేవకులు వెంట నడిచారు. రోజుకు సుమారు 300 కి.మి. చొప్పున అద్వానీ ప్రయాణం సాగించారు.

బీహార్ లో అద్వానీ అరెస్టు

వేలాది కిలోమీటర్లు యాత్ర సాగించిన అద్వానీ ధన్బాద్, రాంచీ, హజారీబాగ్, నవాడా మీదుగా పాట్నా చేరుకున్నారు. ఆయన ప్రసంగం వినడానికి అక్కడి గాంధీ మైదానానికి సుమారు 3 లక్షల మంది జనం వచ్చారు. సమస్తిపూర్ లో అద్వానీ బస చేశారు. అయితే రథయాత్ర మత హింసకు దారితీస్తోందన్న ఆరోపణలతో బీహార్ లోని నాటి లాలూప్రసాద్ యాదవ్ ప్రభుత్వం.. అద్వానీని అరెస్టు చేయాలని నిర్ణ‌యించింది. కేంద్రం ఆదేశాలతో.. డీఐజీ రామేశ్వర్ ఓరాన్, ఐఏఎస్ రాజ్ కుమార్ సింగ్ కు అద్వానీ అరెస్టు బాధ్యతలు అప్పగించింది. అక్టోబర్ 23న ఉదయం 5 గంటలకు రామేశ్వర్ ఓరాన్, రాజ్ కుమార్ సింగ్ వెళ్లి అద్వానీ ఉంటున్న గది తలుపుకొట్టారు. తమను తాము పరిచయం చేసుకున్న ఆఫీసర్లు అక్కడికి వచ్చిన విషయం చెప్పారు. దీంతో 15 నిమిషాలు టైం అడిగిన అద్వానీ.. అప్పటికప్పుడే రాష్ట్రపతికి లెటర్ రాశారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు విత్ డ్రా చేసుకుంటుందని అందులో పేర్కొన్నారు. అరెస్టు తర్వాత.. అద్వానీ, ప్రమోద్ మహాజన్‌‌లతో కలిసి ఆఫీసర్లు కారులో మసంజోర్ గెస్ట్ హౌస్‌‌కు తీసుకెళ్లారు. అద్వానీని అదుపులోకి తీసుకున్నా.. యాత్ర ఆగలేదు. అరెస్టులు కొనసాగినా కరసేవకులు అయోధ్యకు చేరుకున్నరు.

రామ జన్మభూమికి ఊపిరి

అయోధ్య రామ మందిరం నిర్మాణం అంశం..అద్వానీ రథయాత్రకు ముందు.. రథయాత్ర తర్వాత అన్నట్లుగా మారింది. అంతకుముందు కొన్ని ప్రయత్నాలు జరిగినా.. అద్వానీ యాత్ర మాత్రం గుడి నిర్మాణ ఆశలను సజీవంగా ఉంచింది.

ఆలయం అక్కడే కడతం

ఈ నిర్మాణం (మసీదు) శిథిలమైంది. దశాబ్దాలుగా పట్టించుకోకుండా వదిలేశారు. కొన్నేళ్లు గా అక్కడ అజాన్ ఇవ్వడం లేదు. అజాన్ ఇవ్వని కట్టడం మసీదు కాదని ముస్లిం గ్రంథాలు కూడా చెబుతున్నాయి. సరయూ నది అవతలికి ఆ నిర్మాణాన్ని తరలించేందుకు టెక్నాలజీ ఉంది. ముస్లింలు ఈ నిర్మాణంపై తమ వాదనను విరమించుకోవాలి. రాముడితో సంబంధం ఉన్న, హిందువుల మత, సాంస్కృతిక గుర్తింపునకు చిహ్నంగా ఉన్న ఈ స్థలంలోని ఆ నిర్మాణాన్ని వేరే చోటుకు మార్చండి.
    – రథయాత్రలో బీజేపీ నేత ఎల్ కే అద్వానీ

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates