ఉద్యమం చేశా.. చౌరస్తా నుంచి ఎత్తుకొచ్చి మండలి ఛైర్మన్ పదవి ఇవ్వలే

బీజేపీలోకి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు  శాసన మండలి మాజీ ఛైర్మన్, బీజేపీ నేత స్వామిగౌడ్. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్వామిగౌడ్.. ఉద్యమకారుల్ని టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు. కడుపుకి ముద్దలేకపోయినా గజ్జెకట్టి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ దెబ్బలు తిన్న జర్నలిస్ట్ ల జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేశామో.. ఇప్పుడు అదే ఆత్మగౌరవం టీఆర్ఎస్ లో లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎంతోమంది ఉద్యమ కారుల్ని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అగ్రతాంబూలం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

కేసీఆర్ తనకు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఇచ్చారని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలపై స్వామిగౌడ్ స్పందించారు. ముఖ్యమంత్రికన్నా తనకు  పెద్ద పదవి ఇచ్చారంటే నన్ను చౌరస్తా నుంచి ఎత్తుకెళ్లి ఇవ్వలేదు కదా అని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేశా, లాఠీ దెబ్బలు తిన్నా..రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగిన విషయం అందరికి తెలుసన్న ఆయన..తనకి బీజేపీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు.

ఆర్ఎస్ ఎస్ తో పాటు దివంగత బీజేపీ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కారు డ్రైవర్ గా పని చేసినట్లు నాటి స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. అత్తగారింట్లో తన్నులు తిని అమ్మగారింటికి వస్తే ఎంత సాధరంగా ఆహ్వానిస్తారో..అంత సాదరంగా పార్టీ తనని ఆహ్వానించిందని బీజేపీ నేతల స్వామీగౌడ్ ఆనందం వ్యక్తం చేశారు.

Latest Updates