సమ్మెపై జోక్యం చేసుకోండి : గవర్నర్ ను కోరిన బీజేపీ నేతలు

హైదరాబాద్, వెలుగు:

ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ను బీజేపీ నేతలు కోరారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు ప్రారంభించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గురువారం రాజ్​భవన్​లో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ నేతృత్వంలో బీజేపీ నేతలు ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ సమ్మెతో జనం ఇబ్బంది పడుతున్నారని, సమ్మె అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకుండా చూడాలన్నారు. కార్మికులకు సెప్టెంబర్​ జీతాన్ని, ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్ల బకాయిలను చెల్లించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు.

రెండు నెలల కిందే నోటీసిచ్చినా…

రెండు నెలల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని, అందుకే కార్మికులు సమ్మె చేస్తున్నారని గవర్నర్​కు బీజేపీ నేతలు వివరించారు. సమ్మెకి మూడు రోజుల ముందే కార్మికులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించినా ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిందని వివరించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీల అమలు కోసమే కార్మికులు సమ్మె బాట పట్టారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మాట్లాడిన కేసీఆర్​.. ఇప్పుడు మాత్రం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పండుగ టైంలో సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకుండా రాష్ట్రవ్యాప్తంగా 48 వేల మంది కార్మికులను తొలగించారని అన్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.

ఆర్టీసీ ఆస్తులపై కన్ను

ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇప్పటికే వరంగల్​లో 3.5 ఎకరాల ఆర్టీసీ భూమిని ప్రైవేట్​ వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. కొన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రూ.80 వేల కోట్ల విలువైన ఆస్తులనూ ప్రైవేట్​ వాళ్లకు అప్పగించే కుట్ర చేస్తున్నారన్నారు. ఆర్టీసీకి ఇప్పటిదాకా ఫుల్​​టైం ఎండీ, ఫుల్​​ టైం చైర్మన్​ను నియమించకుండా కార్మికులపై నెపం మోపుతున్నారన్నారు. 2011 నుంచి నియామకాలు చేపట్టకపోవడం, కొత్త బస్సులను కొనకపోవడంతో ప్రైవేట్​పరం చేస్తారన్న భయం కార్మికుల్లో ఉందన్నారు. దసరా పండుగను అందరూ ఆనందంతో జరుపుకున్నా కార్మికుల కుటుంబాలు మాత్రం ఆవేదనలో ఉండిపోయారన్నారు. సెప్టెంబర్​ జీతాన్ని కూడా ఇవ్వకపోవడంతో మరింత బాధపడ్డారన్నారు.

వైద్య సేవలు ఆపుతారా?

కనీస మానవత్వం లేకుండా ఆర్టీసీ హాస్పిటళ్లలో కార్మికులకు వైద్య సేవలు నిలిపేశారని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ మండిపడ్డారు. గవర్నర్​ను కలిసిన తర్వాత ఆయన రాజ్​భవన్​ ఎదుట మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లు కొత్తవేం కాదని, సీఎం అగ్గితో గోక్కుంటున్నారని అన్నారు. . తెలంగాణలో మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ అంశంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలందరినీ ఏకం చేసి కేసీఆర్​ను గద్దె దించుతామన్నారు.  గవర్నర్​ను కలిసిన వారిలో మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి, జితేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్​రావు, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఉన్నారు.

Latest Updates