యోగాతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే మరుగున పడిన యోగాను ఇవ్వాళ యావత్ ప్రపంచమే విధిగా ఆచరించేలా చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందని బీజేపీ స్టేట్‌‌ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. యోగా అవసరాన్ని, దాని ప్రాధాన్యతను, ప్రతి మనిషి ఆరోగ్యానికి దాని వల్ల కలిగే మేలును యునైటెడ్ నేషన్స్ లో వివరించి, దాన్ని ఆమోదింపజేశారని గుర్తు చేశారు. యోగాను ప్రపంచానికి అందించిన దేశంగా భారత్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా వ్యాపించాయన్నారు. యోగా మన దేశ వారసత్వ సంపద అని, యోగా ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఆదివారం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పలువురు నేతలు యోగా చేశారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగాతో కరోనా వంటి భయంకరమైన వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని సంజయ్ అన్నారు. మానసిక రుగ్మతలను, శారీరక ఒత్తిళ్లను జయించవచ్చన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగాకు మించిన సాధనం మరేది లేదన్నారు.

నేడు బీజేపీ ఆధ్వర్యంలో సర్కారీ ఆస్పత్రుల దగ్గర నిరసనలు

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సోమవారం బీజేపీ రాష్ట్ర శాఖ నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీలు, డీఎంహెచ్ సీల ముందు చేపట్టే నిరసన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. లాక్ డౌన్ రూల్స్ కు అనుగుణంగా తమ నిరసనలు ఉంటాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో కూడా వెంటనే అమలు చేయాలని, సంజీవని యాప్, ఆరోగ్యసేతు యాప్ లను ఇంటింటికి చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలనేది తమ పార్టీ ప్రధాన డిమాండ్ అని చెప్పారు.

ప్రజల ఒత్తిడితోనే సూర్యాపేటకు కేసీఆర్: వివేక్

దేశం కోసం చైనా సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డ సంతోష్ బాబుకు సీఎం కేసీఆర్ నివాళులర్పించకపోవడం, కనీసం సంతాపం ప్రకటించాలనే ఆలోచన కూడా ఆయనలో లేకపోవడం దురదృష్టకరమని, విచారకరమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దీనిపై తెలంగాణ ప్రజలు నిలదీస్తుండడం, ఒత్తిడి పెంచడంతోనే విధిలేక కేసీఆర్ సోమవారం సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సూర్యాపేటకు వెళ్తున్నారని అన్నారు. అంతే తప్ప తెలంగాణ బిడ్డ వీరమరణం పొందారనే కనీస బాధ్యతగా ఆయన వెళ్లడం లేదన్నారు. తెలంగాణ బిడ్డలు చనిపోతే ముఖ్యమంత్రికి పట్టింపు ఉండదని, ఇతరులపై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై ఆయనకు లేదని విమర్శించారు. కుటుంబాన్ని లెక్క చేయకుండా, దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదన్నారు.

Latest Updates