ఇంటికో ఉద్యోగం ఏమైంది?.CS కు BJP వినతి

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో లక్షా 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌‌రావు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని టీఆర్‌‌ఎస్‌‌ నిలబెట్టుకోవాలంటూ సీఎస్‌‌ను కలిసి ఆయన శుక్రవారం వినతి పత్రం ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యూత్‌‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. లక్షా 10 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు 2015లో ప్రభుత్వం శాసన మండలిలో చెప్పిందని, నాలుగేళ్లలో రిటైర్డ్‌‌ అయిన ఉద్యోగులతో కలిసి భారీగా ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. తొమ్మిది వేల టీచర్‌‌ పోస్టులకు నోటిఫికేషన్‌‌ ఇచ్చి రెండు వేల పోస్టులు నింపుతున్నారన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీలు పేరుకుపోతున్నాయని, సరైన విధానం లేకుండా టీఎస్‌‌ పీఎస్సీ ఇచ్చే ప్రతి నోటిఫికేషన్‌‌పై కేసులు నమోదవుతున్నాయన్నారు.  ఉద్యోగాల కోసం యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని చెప్పారు. తర్వాత సచివాలయంలో ఇదే లాస్ట్ ఫోటో అంటూ ఎమ్మెల్సీ రాం చందర్ రావు తదితరులు అక్కడ సెల్ఫీ దిగారు. యువమోర్చా అధ్యక్షుడు భరత్ గౌడ్, అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

Latest Updates