నేను రాజీనామా చేస్త.. లేకపోతే నువ్వు చెయ్‌‌

మోటార్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో ఏడుంది..

హరీశ్‌‌ చెప్పేవన్నీ అబద్ధాలే

బిల్లులో అట్లుంటే నేను రాజీనామా చేస్త.. లేకపోతే నువ్వు చెయ్‌‌

మంత్రి హరీశ్‌‌ రావుకు ఎంపీ అర్వింద్‌‌ సవాల్‌‌

ఎలక్ట్రిసిటీ బిల్లు, అగ్రి చట్టాలపై టీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారం

పెన్షన్ల విషయంలోనూ అబద్ధాలు చెప్తోందని మండిపాటు

మెదక్/ మెదక్ టౌన్, వెలుగు: కేంద్రం రూపొందించిన ఎలక్ట్రిసిటీ బిల్లులో రైతుల బోరు మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడైనా ఉంటే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, అట్ల లేకపోతే మంత్రి హరీశ్​రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని నిజామాబాద్​ఎంపీ ధర్మపురి అర్వింద్​ సవాల్​ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే తన సవాల్​ స్వీకరించాలన్నారు.  ఎలక్ట్రిసిటీ బిల్లుతోపాటు అగ్రి చట్టాలపై టీఆర్​ఎస్​ సర్కార్​ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం ఆయన మెదక్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంటలో రోడ్‌‌ షోలో పాల్గొన్నారు. రైతులకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్రి చట్టాలు తీసుకువచ్చిందని అర్వింద్​ చెప్పారు. ‘‘కాంగ్రెసోళ్లు అమ్ముడు పోయిన బ్యాచ్. సిగ్గు లేకుండా గాంధీ భవన్ లో పనిచేసే వారి జీతాలు కూడా కేసీఆర్​ దగ్గర తీసుకుంటున్నరు. వాళ్లు పూర్తిగా అమ్ముడు పోయిండ్రు. వాళ్ల అధ్యక్షుడి కాడికెళ్లి ఆఫీస్ లో పనిచేసే క్లర్క్ దాకా అందరి జీతాలు కేసీఆర్ ఇస్తరు” అని విమర్శించారు. పెన్షన్ల విషయంలోనూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నదని మంత్రి హరీశ్​రావు  తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్వింద్​  మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా కేంద్రం 75 శాతం పెన్షన్ ఇస్తున్నదని స్వయంగా సీఎం కూతురు కవిత చెప్పారని, డౌట్ ఉంటే ఆమెను అడిగి తెలుసుకోవాలని హరీశ్​రావుకు  ఆయన సూచించారు. మూర్ఖపు ముఖ్య మంత్రి చెయ్యవట్టి ఈ సారి మక్క సాగు విస్తీర్ణం బాగా తగ్గిందని విమర్శించారు. కేసీఆర్ అసలు మక్కలే కొనబోమనడం దారుణమని మండిపడ్డా రు. ‘‘మంచిగా నడిచే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పథకం ప్రకారం పాడువడగొట్టిన్రు. ప్రైవేట్ కంపె నీలు ఆ ఫ్యాక్టరీలను నడపడానికి రెడీగా ఉన్నా  వాళ్లకు ఇవ్వకుండా సీఎం టైమ్ పాస్ చేస్తున్నరు. ఎన్ఎస్ఎఫ్ లకు రూ. 500 కోట్ల ఆస్తులు ఉండ గా విలువైన ఆ జాగాలు అమ్ముకునేందుకు ప్లాన్ చేస్తున్నరు” అని ఆయన ఆరోపించారు.

అబద్ధాలతో ఎన్ని రోజులు కాలం గడుపుతరు?

టీఆర్ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని అర్వింద్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో టీఆర్​ఎస్​ అభ్యర్థి గెలువకుంటే పెన్షన్లు ఆగిపోయాతాయంటూ భయపెడుతున్నారని విమర్శించారు. ‘‘నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లో బీజేపీ క్యాండిడేట్లు ఎంపీలుగా  గెలిచిన్రు. అక్కడ పెన్షన్లు ఆగినయా?” అని ప్రశ్నించారు. పీడీఎస్ బియ్యం, పీఎం కిసాన్, మరుగు దొడ్ల నిర్మాణం, వంట గ్యాస్, పెన్షన్ లు, వైకుంఠధామాలు, రైతు రుణాలు.. ఇలా ఎన్నో స్కీంలకు కేంద్రం ఫండ్స్ ఇస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలతో కాలం గడుపుతుందని, ఇకనైనా నిజాలు మాట్లాడాలని హితవు పలికారు.

For More News..

పేషంట్లు రాక కరోనా బెడ్లు ఖాళీ

Latest Updates