భారత్ హిందూ దేశమే: ఎంపీ రవి కిషన్

భారత్ కచ్చితంగా హిందూ దేశమేనని బీజేపీ ఎంపీ రవి కిషన్ అన్నారు. ఇవాళ పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 100 కోట్ల మంది హిందువుల జనాభా ఉందని, దీన్ని బట్టి స్పష్టంగా భారత్ హిందూ దేశం అని అనడంలో తప్పులేదని అన్నారు. ప్రపంచంలో చాలా క్రిస్టియన్, ముస్లిం దేశాలు ఉన్నాయని చెప్పారు రవి కిషన్. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి మనకు భారత దేశం ఉందని, ఇది మన అదృష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

రేసు గుర్రం సినిమాలో విలన్‌గా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన యాక్టర్ రవి కిషన్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు.

అయితే ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. చాలా మంది ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ ట్విట్టర్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ముస్లిం, క్రిస్టియన్స్‌ దేశాలు 60కి పైగా ఉన్నాయని, హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం భారత్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

ఎంపీ రవి కిషన్ చెప్పింది నిజమని, జిన్నా పాకిస్థాన్‌ను కోరింది కూడా మతం ప్రాతిపదికనేనని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

అయితే మరికొందరు మాత్రం దీన్ని రవి కిరణ్ స్టేట్‌మెంట్‌ను ఖండించారు. భారత్ సెక్యులర్ దేశమంటూ పోస్టులు పెట్టారు. భారత్‌ని ఒకే మతానికి చెందిన దేశంగా చూపొద్దంటూ కామెంట్స్ చేశారు. ఇండియాకు బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చినందుకు తాను బాధపడతున్నానని, రాజకీయ నాయకులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, సైనికుల త్యాగాలకు అర్థం లేకుండా చేస్తున్నారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

Latest Updates