రెండ్రోజుల పాటు హైదరాబాద్‌‌లోనే మోడీ

రెండ్రోజుల పాటు హైదరాబాద్‌‌లోనే మోడీ

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న మోడీ తొలిసారి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. జులై 2న స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్తారు. అనంతరం హెచ్ఐసీసీలో జరిగే కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. మొదటి రోజు కార్యక్రమం పూర్తైన అనంతరం తిరిగి రాజ్ భవన్ చేరుకోని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. జులై 3న హెచ్ఐసీసీలో జరిగే రెండు రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం ఆ రాత్రికి రాజ్ భవన్ లో బస చేస్తారు. 4న ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఏపీకి వెళ్లనున్నారు. 

ప్రధాని రాక నేపథ్యంలో హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు, పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా 5వేల మందికి పైగా పోలీసు బలగాలతో సెక్యూరిటీ ఉంటుంది. హెచ్ఐసీసీతో పాటు పరేడ్ గ్రౌండ్స్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ కమాండోలతో పాటు కేంద్ర బలగాలు పహరా కాయనున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ కమీషనరేట్లకు చెందిన ఇద్దరు డీసీపీ  స్థాయి అధికారులు, ఎస్పీజీ బలగాలతో కమ్యూనికేట్ చేసుకుంటారు. పీఎంఓతో పాటు ఎస్పీజీ సీనియర్ అధికారులు ఇప్పటికే రాష్ట్ర పోలీస్ అధికారులతో మాట్లాడి.. భద్రతా వివరాలు ఎప్పటికప్పుడు  తెలుసుకుంటున్నారు.  హెచ్ఐసీసీ, పరేడ్ గ్రౌండ్స్, రాజ్ భవన్ ఏరియాలను 48గంటల ముందు నుంచే ఎస్పీజీ బృందాలు ఆధీనంలోకి తీసుకోనున్నాయి. పీఎం మోడీ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ పై పీఎంఓ అధికారులతో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే చర్చించారు.  జూలై 2,3న వెదర్ రిపోర్ట్స్ కూడా భద్రతా విభాగానికి వాతావరణ శాఖ అధికారులు అందించారు. 

ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా హైదరాబాద్ కు రానున్నారు. వారి భద్రత కోసం అదనపు బలగాలను సిద్దంగా ఉంచాలని రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. కార్యవర్గ సమావేశాలకు వచ్చే అతిధుల కోసం సిటీలోని టాప్ హోటల్స్ లో రూమ్స్ బ్లాక్ చేశారు. ఆయా హోటల్స్ చుట్టూ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలు ఉండే హోటల్స్ లో పనిచేస్తున్న వారి ఆధార్ తో పాటు ఐడీ కార్డులను పరిశీలిస్తున్నారు. వీళ్ళకి స్పెషల్ ఐడీ కార్డులు జారీ చేస్తారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. పీఎం మోడీ టూర్ సెక్యూరిటీకి సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఎస్పీజీ బృందాలతో నిరంతరం కో ఆర్డినేట్ చేసుకుంటున్నారు.