అడ్డం తిరుగుతున్న కమలం కేడర్?

అభ్యర్థుల ఎంపికపై జార్ఖండ్ బీజేపీలో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.​ 16వ లోక్‌సభలో జార్ఖండ్‌ నుంచి 12 మంది బీజేపీ సభ్యులుండగా, ఈసారి కనీసం అయిదు స్థానాల్లో దెబ్బ తినవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కీలకమైన ఛాత్ర, పలమావ్‌, కొడెర్మ, రాంచీ, రాజ్‌మహల్‌ సీట్లలో లోకల్‌ లీడర్లు అసహనంతో ఉన్నారని సమాచారం. సీట్ల కేటాయింపులో తమను పక్కన పెట్టేశారన్న ఆరోపణతో ముభావంగా పనిచేశారని అంచనా. మరోవైపున ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూటమిలో ఆర్‌జేడీ తిరుగుబాటు జెండా ఎగరేసింది. తనకు దక్కిన ఒక సీటుతోపాటు మరో సీటులోనూ పోటీకి దిగింది. ఇప్పటికి ఏడు సీట్లకు పోలింగ్‌ ముగియగా, మిగిలిన రెండు విడతల్లో మరో ఏడు సీట్లకు పోలింగ్‌ జరగాల్సి ఉంది.

బీజేపీకీ మరే రాష్ట్రంలోనూ లేని చిత్రమైన పరిస్థితి జార్ఖండ్‌లో ఎదురైంది. ఈ రాష్టంలో మరో ఏడు నెలలకే అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. దాంతో ఇప్పటినుంచే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొన్ని లోక్‌సభ స్థానాల్లో తమను సంప్రదించకుండా పార్టీ హైకమాండ్ టికెట్లు ఇచ్చిందని లోకల్ లీడర్లు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మరికొన్నిచోట్ల  సిట్టింగ్ ఎంపీలకు  టికెట్లు ఇవ్వలేదు. దీంతో అధిష్టానంపై ఒత్తిడి బాగా పెరిగింది.  చివరకు ఈ లుకలుకలే పార్టీ కేండిడేట్ల విజయావకాశాలను దెబ్బతీస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పలమూవ్‌ నియోజకవర్గంలో  సిట్టింగ్ ఎంపీ విష్ణు దయాళ్ రామ్‌కు బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది. విష్ణు దయాళ్‌పై  లోకల్‌గా కార్యకర్తలు అసంతృప్తితో సరిగ్గా సహకరించలేదని సమాచారం. 2014లో గెలిచాక ఈ ఐదేళ్లూ ఎవరికీ ఆయన అందుబాటులో లేరన్నది వారి ఆరోపణ. పలామూ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు రాజకీయవర్గాల సమాచారం. ఛాత్రా లోక్‌సభ నియోజకవర్గానికి వస్తే సిట్టింగ్ ఎంపీ సునీల్ సింగ్ మరోసారి ఇక్కడ పోటీలో నిలిచారు. ఆయనపై కూడా స్థానిక లీడర్లు నారాజ్‌గా ఉండి అసంతృప్తిగానే ప్రచారంలో పాల్గొన్నట్టు తెలిసింది. ఛాత్రా అభివృద్ధికి సునీల్‌ సింగ్‌ చేసిన కృషి ఏమీ లేదని కార్యకర్తలు బాహాటంగానే విమర్శలు చేశారు. కార్యకర్తల నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చినప్పటికీ పార్టీలోని రాజ్‌పుత్‌ లాబీ ఒత్తిడి  మేరకు మళ్లీ సునీల్ సింగ్‌కే టికెట్ ఇచ్చారు. ఈ రెండు చోట్ల ఫేజ్‌–4లో ఏప్రిల్‌ 29న పోలింగ్‌ ముగిసిపోవడంతో అధికారిక అభ్యర్థుల గెలుపుపై రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొడెర్మ లోక్ సభ సెగ్మెంట్ విషయానికొస్తే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ  రవీంద్ర రేకి ఈసారి టికెట్ లభించలేదు. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణ దేవికి బీజేపీ హై కమాండ్ టికెట్ ఇచ్చింది. అన్నపూర్ణ దేవి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. సిట్టింగ్‌ ఎంపీని కాదని, ఫిరాయించిన
నాయకురాలికి టికెట్ ఇవ్వడంపై  స్థానికంగా అసంతృప్తి రగిలిపోయింది. అన్నపూర్ణ దేవికి టికెట్ ఇచ్చే ముందు కనీసం సంప్రదించలేదని హై కమాండ్‌పై వారు గుర్రుగా ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన రాంచీ నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎంపీ రాంతహల్ చౌధురిని పక్కన పెట్టి సుబోధ్ సేఠ్‌కి టికెట్ ఇచ్చింది. దీంతో రాంతహల్ చౌధురి పార్టీ హై కమాండ్‌పై తిరుగుబాటు చేశారు. ఇండిపెండెంట్‌గా  బరిలో నిలబడ్డారు. చౌధురి పోటీ చేయడం వల్ల బీజేపీ కేండిడేట్ విజయావకాశాలు దెబ్బతింటాయని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ స్థానాలకు ఫేజ్‌–5 కింద మే ఆరో తేదీన ఎన్నికలు ముగిశాయి.

ఇక, ఫేజ్‌–6 కిందకు వచ్చిన గిరిధ్‌ లోక్‌సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ రవీంద్ర పాండే, లోకల్ ఎమ్మెల్యే మహతో మధ్య గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఆ సీటును పొత్తులో భాగంగా ‘ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)’కి బీజేపీ వదిలేసింది. ఏజెఎస్‌యూ తరఫున చంద్ర ప్రకాశ్ చౌధురి ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే చంద్రప్రకాశ్ చౌధురి గెలుపుకోసం రవీంద్ర పాండే, మహతో ఇద్దరూ పనిచేయడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఈ నెల 12న పోలింగ్ జరగబోతోంది.

చివరి ఫేజ్‌లో పోలింగ్‌ జరిగే రాజ్‌మహల్‌ (ఎస్‌టీ) సీటులో హేమ్ లాల్ ముర్ముకు బీజేపీ టికెట్ ఇచ్చింది. హేమ్ లాల్ గతంలో ‘జార్ఖండ్ ముక్తి మోర్చా  (జేఎంఎం)’లో పనిచేసిన లీడర్. ఆయనకు ఇప్పటికీ జేఎంఎంతో సంబంధాలున్నాయని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ కోసం పనిచేసినవారు ఎంతోమంది ఉండగా అందరినీ పక్కన పెట్టి జేఎంఎం నుంచి వచ్చిన నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని వీరు మండిపడుతున్నారు. మే 19న ఇక్కడ పోలింగ్  జరగబోతోంది.

ముస్లింల ఓట్లు చీలిపోతాయా?

జార్ఖండ్‌లోని మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థులను నిలబెట్టలేదు. బీజేపీపై ముస్లింలు ఎటూ ఆశలు పెట్టుకోలేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గం మండిపడుతోంది. సెక్యులర్ పేరు చెప్పుకుని ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చే  బీజేపీయేతర పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చీలిపోతాయని అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్ జనాభాలో 15 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అయినప్పటికీ ఒక్క ముస్లింకు కూడా ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం దారుణం అన్నారు సామాజిక కార్యకర్త నదీమ్ ఖాన్.  17వ లోక్‌సభలో జార్ఖండ్ ముస్లింల వాయిస్ వినిపించే అవకాశమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జార్ఖండ్‌లో పార్టీల బలాబలాలు

జార్ఖండ్ రాష్ట్రం 2000లో ఏర్పడింది. 2004లో తొలిసారి ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 14 నియోజకవర్గాల్లో ఆరు సెగ్మెంట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. జేఎంఎం నాలుగు సీట్లను, ఆర్జేడీ రెండు సెగ్మెంట్లను,  సీపీఐ, బీజేపీ చెరో నియోజకవర్గాన్ని గెలుచుకున్నాయి. 2009 నాటికి బీజేపీ పుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తొమ్మిది సీట్లను దక్కించుకుంది. జేఎంఎం రెండు సెగ్మెంట్లను గెలుచుకుంది. జేవీఎం (ప్రజాతాంత్రిక్), కాంగ్రెస్, ఇతరులు తలా ఒక సీటునీ గెలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ మొత్తం 14 స్టానాల్లో 12 సీట్లను కైవసం చేసుకోగా, జేఎంఎం రెండు సీట్లను గెలుచుకుంది.

Latest Updates