బల్దియా వార్‌‌ను హీటెక్కించనున్న బీజేపీ.. ప్రచారంలోకి జాతీయ నేతలు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు కొల్లగొట్టాలని టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. బుధవారం బీజేపీ ముఖ్య నేతలు ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ ప్రెస్‌‌మీట్‌‌లో లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ప్రచారంలో జాతీయ నేతలు పాల్గొననున్నారని తెలిపారు. గ్రేటర్ ప్రచారంతోపాటు పార్టీ మ్యానిఫెస్టో, తదితర కీలక అంశాల గురించి లక్ష్మణ్ వివరించారు.

రాష్ట్ర నాయకత్వం కోరిక మేరకు జాతీయ నేతలు ప్రచారంలో భాగస్వామ్యం కానున్నారని లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 27న ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పార్లమెంట్, చేవెళ్లలో రోడ్ షోలో పాల్గొంటారని అన్నారు. 28న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రోడ్ మల్కాజ్‌‌‌గిరి షోలో పాల్గొంటారని చెప్పారు. 29న సికింద్రాబద్‌‌లో రోడ్‌‌ షోలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని పేర్కొన్నారు. వీరితోపాటు బడుగు, బలహీన వర్గాల కోసం సాత్వి నిరంజన్ జ్యోతి ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా గ్రేటర్ బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

వరద, బురద రానటువంటి హైదరాబాద్‌‌ను నిర్మాణం చేస్తామని, దీనికి సంబంధించిన వివరాలను మ్యానిఫెస్టోలో చేర్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్రూం, వరద సాయం, కోవిడ్‌‌తోపాటు అన్ని విషయాల్లో వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజానిజాలను విన్న ప్రజల్లో టీఆర్ఎప్ పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. దుబ్బాకలోలాగే జీహెచ్‌ఎంసీలోనూ బీజేపీ విజయబావుటా ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Updates