కేసీఆర్ ది సారు, కారు, బారు, రజాకార్ల సర్కారు

విమోచన దినోత్సవం నిర్వహించేందుకు KCR భయపడుతున్నారని విమర్శించారు కేంద్రమంత్రులు. కేసీఆర్ కార్ ను మజ్లీస్ పార్టీ నడిపిస్తోందని విమర్శించారు. తెలంగాణ విమోచనం సందర్భంగా.. పటాన్ చెరులో బీజేపీ సభ నిర్వహించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే నిజాం నుండి విముక్తి దొరికిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచనాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు కమలం నేతలు.

సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. కేసీఆర్ కారులో ఎంఐఎం షికారు చేస్తోందని విమర్శించారు. ప్రాజెక్టుల్లో అవినీతితో దోచుకున్నారని మండిపడ్డారు. హర్యానా, బీహార్ మాజీ సీఎంలకు పెట్టిన గతే.. భవిష్యత్ లో కేసీఆర్ కు పడుతుందన్నారు. అటు వెస్ట్ బెంగాల్ ఇటు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు ప్రహ్లాద్.

మజ్లిస్ కు భయపడే టీఆర్ఎస్ పార్టీ విమోచన దినోత్సవం జరపట్లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నిజాం తనకు ఆదర్శమని సీఎం చెప్పుకుంటా… తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారని విమర్శించారు. రజాకార్లకు వారసత్వ పార్టీ మజ్లీస్ అన్న కిషన్.. వారితో దోస్తీ చేస్తూ అమరులను అవమాన పరచే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ది సారు కారు బారు.. రజాకార్ల సర్కారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేసీఆర్ నిరంకుశ పాలనను తెలంగాణకు విముక్తి లభించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. తెలంగాణకు ప్రాణశ్వాస అయిన సెప్టెంబర్ 17 ను ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.

సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులఅర్పించి.. ర్యాలీగా సభకు వచ్చారు. ప్రజాస్వామ్య నిర్మాణం కోసం అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సభలో స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు కమలం నేతలు.

Latest Updates