కేసీఆర్ ఇక కాస్కో.. చుక్కలు చూపిస్తం

  • అమరుల చరిత్రను చెరిపేసేందుకు కేసీఆర్​ యత్నం
  • సెప్టెంబర్​ 17ను విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్
  • పోలీసు నిర్బంధం మధ్య బీజేపీ అసెంబ్లీ ముట్టడి
  • విడతలుగా అసెంబ్లీ దగ్గరికి చేరుకున్న నేతలు, కార్యకర్తలు
  • రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ లీడర్ల ముందస్తు అరెస్టులు, హౌస్​ అరెస్టులు
  • సంజయ్ సహా వందల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • హైదరాబాద్​లో పోలీసుల లాఠీచార్జి.. కొందరు కార్యకర్తలకు గాయాలు

హైదరాబాద్, వెలుగు నెట్వర్క్రాష్ట్ర సర్కారు సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని, అధికారికంగా వేడుకలు నిర్వహించాలనే డిమాండ్ తో బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి విజయవంతంగా జరిగింది. పోలీసు నిర్బంధాలు, ఎక్కడిక్కడ ముందస్తు అరెస్టులు, భారీగా మోహరించిన బలగాలు, ఉద్రిక్తత మధ్య బీజేపీ నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ సమీపానికి చేరుకోగలిగారు. నిజాం, రజాకార్ల దుశ్చర్యల నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాల్సిదేనని డిమాండ్​ చేశారు.

ఎక్కడిక్కడ నిర్బంధం..

బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్​ పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు హైదరాబాద్​కు బయలుదేరారు. అయితే పోలీసులు గురువారం రాత్రి నుంచే నిర్బంధానికి దిగారు. చాలా చోట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలను హౌజ్​ అరెస్టు చేశారు. వాహనాల్లో బయల్దేరినవారిని మధ్యలోనే అడ్డుకుని వెనక్కి పంపించారు. అయినా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముందున్న గన్ పార్క్, చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. సర్కారు, సీఎం కేసీఆర్​ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్​ పోలీస్​స్టేడియానికి తరలించారు. తర్వాత మరికొందరు అసెంబ్లీ దగ్గరికి చేరుకున్నారు. ఇలా విడతల వారీగా వందలాది మంది వచ్చి నిరసన తెలిపి, అరెస్టయ్యారు. ఇక పార్టీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్ ను బంజారాహిల్స్ లో అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్​స్టేషన్ కు తరలించారు. పార్టీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, సీనియర్లు ​లక్ష్మణ్, పెద్దిరెడ్డి, ​పేరాల శేఖర్ రావు, మరికొందరు నేతలను ముందుగానే గృహనిర్బంధం చేశారు.

లాఠీచార్జిలో గాయపడ్డ నేతలు

అసెంబ్లీ ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో తోపులాట జరిగింది. ఈ టైంలో పోలీసులు ఆగ్రహంతో లాఠీచార్జి చేశారు. దీంతో కొందరు నేతలు, కార్యకర్తలు గాయపడ్డారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర చీఫ్ బాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిలకు గాయాలయ్యాయి. తీవ్రంగా దెబ్బలు తగిలిన కొందరు కార్యకర్తలను హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​ ఇస్తున్నారు. అసెంబ్లీ వద్ద వరంగల్​ జిల్లా సీనియర్​ నేతలు రావు పద్మ, కొండేటి శ్రీధర్, వద్దిరాజు రామచందర్​రావు, దశమంత్​రెడ్డి, కన్నం యుగంధర్, భాస్కర్ రెడ్డి.. ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసుదేవరావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సన్నీ ఉదయ ప్రతాప్.. యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు, సూర్యాపేట జిల్లాకు చెందిన ఓర్సు వేలంగి రాజు.. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి కృష్ణ.. కరీంనగర్​జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ తదితరులు అరెస్టయ్యారు.

జిల్లాల్లో ముందస్తు అరెస్టులు

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్​ నేత​ రేవూరి ప్రకాశ్​రెడ్డి, కొందరు లీడర్లను హౌజ్​ అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్న రాజు, ఇతర లీడర్లను అరెస్ట్​చేశారు. ఆదిలాబాద్​లోపార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​ను హౌజ్​ అరెస్టు చేశారు. నిర్మల్‍లో రావుల రాంనాథ్, ఒడిసెల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడేల్, అజ్మీరా ఆత్మారామ్ నాయక్ ను అరెస్టు చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు సహా 450 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

బీజేపీ దమ్ము ఏమిటో చూపిస్తం: బండి సంజయ్

రానున్న రోజుల్లో బీజేపీ దమ్ము ఏమిటో సీఎం కేసీఆర్ కు చూపిస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఉద్యమాలను చేపడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం పోలీస్​స్టేషన్​ నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్​ సర్కార్​ పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రజా ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాడిచేయడం దారుణమన్నారు. కేసీఆర్ సర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ అసెంబ్లీ ముట్టడి సక్సెస్​ అయిందని, దీనిపై పార్టీ నేతలు, కార్యకర్తలను అభినందిస్తున్నానని చెప్పారు.

అమరుల చరిత్రను తుడిచేసేందుకే..

కేసీఆర్ అబద్ధాలకు త్వరలోనే సమాధి కడతం. తెలంగాణ అమరుల చరిత్రను తుడిచేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. మజ్లిస్​తో ఓట్ల రాజకీయం చేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. నిజాం గోరీ వద్ద కేసీఆర్ మోకరిల్లినప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ ఆవిరైపోయినయి. నిజాం పాలన సాగించే కేసీఆర్ కావాలో.. దేశం కోసం పనిచేసే బీజేపీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలె. అమరుల త్యాగాలను స్మరించుకుందాం. సెప్టెంబర్ 17ను సర్కారు అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలె.

– బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి  సంజయ్

Latest Updates