కేసీఆర్ కాచుకో..కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది

  • టీఆర్ఎస్ కు ‘సన్’ స్ట్రోక్.. బీజేపీకి సన్ రైజ్ గులాబీ పార్టీపై సాఫ్రాన్ స్ట్రైక్ చేసినం
  • సారు, కారు ఇక రారు.. 2023 లో కారు షెడ్డుకే
  • గడీల పాలన బద్ధలు కొట్టే దమ్ము బీజేపీకే ఉంది
  • సీట్లే కాదు.. ఓట్ల శాతాన్నీ పెంచుకున్నమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘కేసీఆర్.. ఇక కాచుకో’ అంటూ సవాల్ విసిరారు. తాజా రిజల్ట్​తో టీఆర్ఎస్ కు ‘సన్’ స్ట్రోక్ తగిలిందని.. కానీ బీజేపీకి మాత్రం సన్​రైజ్ అని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాన్ని భాగ్యనగర ప్రజలు తమకు ఇవ్వలేదని, అయితే గులాబీ పార్టీపై సాఫ్రాన్ స్ట్రైక్ చేసే చాన్స్ మాత్రం తమకు దొరికిందన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన సంబురాల్లో సంజయ్ పాల్గొన్నారు. తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇగ రిజల్ట్స్​ఇట్లనే వస్తయ్..

రాష్ట్రంలో గడీల పాలనను బద్ధలు కొట్టే దమ్ము ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని బండి సంజయ్ చెప్పారు. గడీ నుంచి సీఎం కేసీఆర్ ను బయటకు తీసుకొస్తామన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పటి నుంచైనా కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సారు, కారు ఇక రారని, 2023లో కారు షెడ్డుకు పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఇదే రకమైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు.

మా విజయం.. ఎస్ఈసీ, డీజీపీకి అంకితం

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అర్ధరాత్రి తప్పుడు సర్క్యులర్ ఇవ్వడం దారుణమని సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆ పార్టీ గెలుపు కోసం ఎస్ఈసీ, డీజీపీ కష్టపడ్డారని ఎగతాళి చేశారు. అందుకే బీజేపీ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నామన్నారు. గెలిచామని అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోబోమని, తమ పార్టీని ఆదరించిన హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో సీట్లు మాత్రమే కాదు, ఓట్ల శాతాన్ని కూడా భారీగా పెంచుకున్నామన్నారు. టీఆర్ఎస్​కు గతంతో పోల్చితే ఈసారి సీట్లు బాగా తగ్గాయన్నారు. జాతీయ నాయకుల ప్రచారం తమకు బాగా కలిసి వచ్చిందని చెప్పారు. హిందూ సమాజం మనోభావాలకు వ్యతిరేకంగా ఒక వర్గం వారికి కొమ్ముకాస్తున్న సీఎం కేసీఆర్ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు.

2023లో అధికారానికి దారి..: కిషన్​రెడ్డి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు గ్రేటర్ జనం అసలైన జవాబిచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల ఆదరణను టీఆర్ఎస్ వేగంగా కోల్పోతోందని, ఆ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును టీఆర్ఎస్ సవాల్ గా స్వీకరించాలని డిమాండ్ చేశారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రేటర్ ఎన్నికలు తమకు ప్లాట్ ఫాం మాదిరి నిలవనున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్  అక్రమ కేసులు పెట్టినా తమ పార్టీ కార్యకర్తలు ఏమాత్రం భయపడలేదని, వారి పోరాట స్ఫూర్తి గొప్పదని ప్రశంసించారు.
కూలిపోతున్న టీఆర్ఎస్ లోకి తమ పార్టీ కార్పొరేటర్లు ఎవరు వెళ్లరన్నారు.

Latest Updates