దుబ్బాక రిజల్ట్ తో కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయితది

  • ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయం: బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్
  • యూత్ సత్తా ఏంటో హరీశ్ కు తెల్వదని కౌంటర్  
  • నామినేషన్ ఫైల్ చేసిన రఘునందన్ రావు         
  • దుబ్బాకలో భారీ ర్యాలీ

సిద్దిపేట, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల రిజల్ట్స్ తో సీఎం కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయితదని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ​బండి సంజయ్ అన్నారు. బై పోల్స్ లో పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ల గుండెల్లో గుబులు పుట్టే తీర్పునివ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా దుబ్బాక పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సంజయ్ పాల్గొని మాట్లాడారు. ‘‘బీజేపీ క్యాండిడేట్ వెంట నలుగురు పోరగాళ్లు తిరుగుతున్నారు’’ అని మంత్రి హరీశ్ రావు కామెంట్ చేశారని.. ఆయనకు వారి సత్తా ఏంటో తెలియదని సంజయ్ అన్నారు. నిజామాబాద్ లో సీఎం బిడ్డను యువతే ఓడించారని, బీజేపీకి నలుగురు ఎంపీలను ఇచ్చిన ఘనత వారిదేనని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయం ఖాయమని, తానిప్పుడు మాట్లాడుతున్న చౌరస్తానే రిజల్ట్స్ తర్వాత విజయోత్సవ ర్యాలీకి వేదిక అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే ఉరేసుకుంటా…

దుబ్బాక నియోజకవర్గానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.285.17 కోట్లు రిలీజ్ చేసిందని సంజయ్ చెప్పారు. దీనిపై చర్చకు సిద్ధమా? అని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఈ ఫండ్స్ ను కేంద్రం మంజూరు చేయలేదని నిరూపిస్తే, తానిక్కడే ఉరేసుకుంటానని అన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తుంటే టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు  పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని కేంద్రం అగ్రిచట్టాలను తీసుకొస్తే, రాష్ట్ర సర్కార్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూట్ కేసులు, పోలీస్ కేసులకు బీజేపీ భయపడదని.. రఘునందన్ నిబద్ధత ప్రజలందరికీ తెలుసునని సంజయ్ అన్నారు. రఘునందన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం  ప్రగతి భవన్ ముట్టడిస్తం 

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల కోసం బీజేపీ కొట్లాడుతుందని సంజయ్ చెప్పారు. రఘునందన్ గెలిచిన తర్వాత వారం రోజుల్లోనే తానే స్వయంగా నిర్వాసితులతో కలసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తానని, వారికి రావాల్సిన పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గకంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై సర్కార్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. మారెమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్వో కార్యాలయం వరకు దాదాపు రెండు గంటల పాటు సాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బీజేపీ ఎన్నికల ఇన్ చార్జి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన కాలేజీనీ తరలించిన్రు: రఘునందన్

మంత్రి హరీశ్ రావు కారణంగానే దుబ్బాక అభివృద్ధికి దూరమైందని రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాకకు ఎన్ని? సిద్దిపేటకు ఎన్ని? నిధులు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దుబ్బాకకు రాకరాక ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ వస్తే, దాన్ని ఇరుకొడుకు తరలించింది నిజం కాదా? అని నిలదీశారు.

Latest Updates