ఇంత కంటే దుర్మార్గం మరొకటి లేదు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని తగ్గించాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకున్నద‌ని.. అనుకున్న‌ట్టుగానే తగ్గించింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ అన్నారు. పొలింగ్ శాతం ను పెంచేందుకు ప్రయత్నం చేయాల్సింది పోయి తగ్గించడానికి కృషి చేశారని, ఇదొక‌ సిగ్గు మాలిన చర్యగా అభివ‌ర్ణించారు. ఇంత కంటే దుర్మార్గం మరొకటి లేదని ఆయ‌న అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఎన్నికలు జ‌రిగాయ‌ని.. వారి పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులనే ఎన్నికల్లో నియమించుకున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్, పోలీసులు TRS, MIM పార్టీల‌కు పూర్తి సహకారం అందించార‌న్నారని సంజ‌య్ విమ‌ర్శించారు. విచ్చల విడిగా డబ్బులు, మద్యం పంచారని.. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తల పైనే కేసులు పెట్టార‌ని, లాఠీ ఛార్జ్ చేసి అరెస్ట్ లు చేశారన్నారు. ఒక ప్లాన్ ప్రకారం గెలవాలని అధికార దుర్వినియోగం చేశారని, అయినా ప్రజలు బీజేపీకి ఓటేశారన్నారు.

ప్రభుత్వ అరాచకాలు, అన్యాయం, దౌర్జన్యాలపై బీజేపీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపవాస దీక్ష చేశారన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీపీఐ, సీపీఎం గుర్తు ఏదో కూడా తెలియకుండా ఉందన్నారు. కారు గుర్తుకు బ్యాలెట్ పేపర్ లో బాక్స్ వేసి ముద్రించారని, పువ్వు గుర్తును మాత్రం సరిగా ముద్రించలేదన్నారు. ఎన్నికల కమిషన్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest Updates