సర్కార్ అడుగులకు మడుగులొత్తుతున్నారు

దుబ్బాక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని, ఇది తెలిసినా.. పోలీసులు, ప్రభుత్వాధికారులు చూసీచూడనట్టే వ్యవహరిస్తున్నార‌ని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అధికారులు తమ బాధ్యతలు మరచి టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. మంగ‌ళ‌వారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. గత అర్ధరాత్రి దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వాహనం తనిఖీ సందర్భంలో పోలీసుల దురుద్దేశపూరిత అత్యుత్సాహాన్ని, పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని సంజ‌య్ అన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమ‌ని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని,త‌మ పార్టీ విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నార‌ని అన్నారు. నిబంధనల మేరకు ప్రచారం కూడా చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని దుబ్బాక ఉపఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని పార్టీల పట్ల సమదృష్టితో వ్యవహరించాలని కోరుతున్నామ‌ని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు కనీసం నిరసన కూడా తెలపనీయకుండా పోలీస్ అధికారులు అడ్డుకుంటున్నారని సంజ‌య్ తెలిపారు. నియంతృత్వ టీఆర్ఎస్ సర్కార్ అడుగులకు మడుగులొత్తుతూ ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కును సైతం హరిస్తున్నారని అన్నారు. నియంతృత్వం ఎక్కువ కాలం కొనసాగదని చరిత్ర చూస్తే తెలుస్తుందని, ఎనిమిదో నిజాంలా వ్యవహరిస్తున్న ప్రస్తుత టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరం లేదని సంజ‌య్ హెచ్చ‌రించారు.

Latest Updates