కేంద్రం పథకాలు అందకుండా టీఆర్ఎస్ కుట్రలు : లక్ష్మణ్

ఢిల్లీ : అధికార టీఆరెస్ …బీజేపీ శ్రేణులపై దాడులు చేస్తూ హత్యా రాజకీయాలు చేస్తోందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఇవాళ ఢిల్లీలో బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన బీజేపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు నాయకులు.

రోజురోజుకీ తెలంగాణలో బీజేపీ బలపడటాన్ని టీఆరెస్ జీర్ణించుకోలేక దాడులకు దిగుతోందని అన్నారు లక్ష్మణ్. పోలీసుల ద్వారా బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోందన్నారు. అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించేందుకు ప్రజా సంఘాలు, కలిసివచ్చే శక్తులతో పోరాడుతామన్నారు. టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నాం కాబట్టే.. బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయన్నారు లక్ష్మణ్.

బీజేపీ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు లక్ష్మణ్. కృత్రిమ యూరియా కొరతను సృష్టించి.. కేంద్రంపై, ఎంపీల పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో స్పందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందనీ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ను ప్రజాక్షేత్రంలోనే దోషిగా నిలబెడతామని చెప్పారు లక్ష్మణ్.

Latest Updates