హిందువుల మ‌నోభావాలు దెబ్బతీసేలా రాష్ట్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు

ప్రపంచమంతా క‌రోనా వైర‌స్ ను నిరోధించడానికి ఒక్కటవుతుంటే.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం అంత్యక్రియల పేరుతో మత రాజకీయాలు చేస్తోంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోవిడ్ -19 వ్యాధితో చనిపోయిన మృతదేహాలను ఖననం చేయడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు హిందువుల మత సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన హిందువులు అంత్యక్రియలను ఐదుగురితో చేయించాల‌న్న‌ నిబంధన పెట్టడం తగదని ఆయ‌న అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో-169లో కేవ‌లం ఒక వర్గాన్ని సంతృప్తి పర్చడం కోసం ఇచ్చినట్లు ఉందని, మెజారిటీ హిందువుల మనోభావలను గౌరవించకపోవడం శోచనీయమ‌న్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్థులు అత్యధికులు ముస్లింలు అయిన‌ప్ప‌టికీ.. వారికి ఎలాంటి సూచనలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు బండి సంజ‌య్. మత రాజకీయాలు మానుకొని కోవిడ్-19తో మరణించే ముస్లిం మరణాలపై మార్గదర్శకాలు విడుదల చేయాల‌న్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం చెయ్యాల్సిన పుణ్య కార్యక్రమాలకు అవసరమైన వారిని అనుమతించాలని, త‌గు జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు ఇవ్వాలని ఆయ‌న అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా విడుదల చేసిన ప్రభుత్వ జీవో-169ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసిన అధికారులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు సంజ‌య్.

Latest Updates