లోకల్ బాడీ లీడర్లేమన్న బిచ్చగాళ్లా?

ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవండని అడుక్కోవాలా?
 సీఎం కేసీఆర్‌‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రాలేమైనా బిచ్చగాళ్లలా కేంద్రాన్ని అడుక్కోవాలా అని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన సీఎం కేసీఆర్‌‌కు, తెలంగాణలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులేమైనా బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ అయ్యారు. తమను అధికారిక కార్యక్రమాలకు పిలవండని రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను బిచ్చగాళ్లలా అడుక్కోవాలా అని గురువారం ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు. లోకల్ బాడీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులంటే సీఎం కేసీఆర్‌‌కు ఎందుకంత చులకన అని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా యాచారం ఎంపీపీకి సమాచారం ఇవ్వకుండానే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి రోడ్డు శంకుస్థాపన ప్రోగ్రామ్‌‌ నిర్వహించడం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపై టీఆర్ఎస్ సర్కార్‌‌ నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. యాచారం ఎంపీపీ దళిత మహిళ అనే కనీస గౌరవం ఇవ్వకుండా ఎమ్మెల్యే కిషన్‌‌రెడ్డి ప్రోద్బలంతో ఆ పార్టీ కార్యకర్తలు, పోలీసులు ఆమెపై దాడికి దిగడం కేసీఆర్ సర్కార్ నియంతృత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

రాష్ట్రంలో దళితులపైనా, మహిళలపైనా దాడులు, అత్యాచారాలు, హత్యాచారాలు జరిగినా పోలీసులు బాధ్యులపై ఎలాంటి కేసులు పెట్టకుండా వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమన్నారు. నాగర్‌‌కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాకర్‌‌రావుపై టీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే పోలీసులు దాడి చేశారని, చాదర్‌‌ఘాట్ ఠాణా పరిధిలో ఒక దళిత బాలికపై టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీ కార్యకర్త అత్యాచారం చేసినా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల బీజేపీ దళిత నాయకురాలి పట్ల అనుచిత కామెంట్లు చేసినా పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వీటిపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌‌రెడ్డి వెంటనే స్పందించి ఈ ఘటనల్లో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కూడా స్పందించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

ఎంపీపీకి సంజయ్ పరామర్శ

టీఆర్‌‌ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడి కర్మాన్‌‌ఘాట్‌‌లోని మాక్సిక్యూర్‌‌ హాస్పిటల్లో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్న యాచారం ఎంపీపీ, దళిత నాయకురాలు సుకన్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

Latest Updates