బండి సంజయ్ స్వాగత సభ: ‘టీఆర్ఎస్ ముక్కు కోద్దాం’

రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కొత్త అధ్యక్షుడి స్వాగత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గన్‌పార్క్‌కు వెళ్లి తెలంగాణ అమర వీరుల స్తూపానికి నివాళి అర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగత సభను ఏర్పాటు చేశారు. అక్కడ పలువురి నేతలు ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అద్యక్షుడు కావాలని తాను కూడా కోరుకున్నానని చెప్పారు. తన తండ్రి డి.శ్రీనివాస్ రెండు సార్లు ఓ పార్టీ (కాంగ్రెస్)కి రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన సమయంలో తాను ఎంతగా సంతోషించానో ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నానన్నారు.

సంజయ్ సారధ్యంలో అధికారంలోకి..

తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని, అసలు అధికారంలోకి ఎలా వస్తుందని సీఎం కేసీఆర్ అంటున్నారని, ఆయన వ్యాఖ్యలు అబద్ధమని రుజువు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎంపీ ధర్మపురి అర్వింద్. నూతన అధ్యక్షుడు బండి సంజయ్ సాధ్యంలో యువత క్షేత్రస్థాయిలో పని చేసి టీఆర్ఎస్ ముక్కు కోద్దామని అన్నారు. సంజయ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

బైంసా బాధితులకు రూ.5 లక్షల సాయం

గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో భైంసాలో జరిగిన అల్లర్లలో బాధితులకు నిజామాబాద్ నియోజకవర్గం తరఫున రూ.5 లక్షల సాయంగా ఇస్తున్నట్లు చెప్పారు ఎంపీ అర్వింద్. దీనికి సంబంధించిన చెక్కును కొత్త అధ్యక్షుడు బండి సంజయ్, తాజా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ల చేతికి అందించారు.

Latest Updates