నేను రూటు మార్చను.. కేసీఆర్, ఎంఐఎం తుక్డేగాళ్ల సంగతేందో చూస్తా

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, మూడేళ్లలో తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్. బంగారు తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్ మానవత్వం లేని ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నారని అన్నారు. తెలంగాణ యువకుల ఆత్మత్యాగాలు, రక్తపుమడుగు పైనా కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, ఆ యువకుల శక్తితోనే ఆయన్ని గద్దె దించుతామని, గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తామని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్, ఎంఐఎం ఒవైసీ కలిసి అరాచకపాలన చేస్తున్నారని, వీళ్ల విధ్వంస రాజకీయాలను దెబ్బకొట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ధర్మ రక్షణ, సమాజం మేలు, పేద ప్రజల బాగు కోసం తాను పోరాడుతానని, బండి సంజయ్ రూటుమార్చడని, కేసీఆర్, ఎంఐఎం తుక్డేగాళ్ల సంగతేదో చేస్తానని చెప్పారాయన. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగించారు. జాతీయ వాదమే ఊపిరిగా బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్న తనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం పార్టీ గొప్పదనమని, ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవమని అన్నారు. తెలంగాణలో జాతీయ వాదం, దేశ భక్తి, హిందుత్వానికి ప్రస్తుతం సంకట స్థితి నెలకొందని, అధికార పార్టీతో కలిసి ఎంఐఎం లాంటి దేశ ద్రోహులు అరాచకాలకు పాల్పడుతున్న సమయంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే ప్రజలు చూస్తున్నారని చెప్పారు బండి సంజయ్. ఈ పరిస్థితుల్లో పార్టీ భాద్యతలు చేపట్టిన తాను కార్యకర్తలందరినీ కలుపుకొని టీఆర్ఎష్‌ను గద్దె దించడానికి పోరాడుతానని అన్నారు.

ఫామ్ హౌస్‌లో నుంచి తీసిన నోట్లిస్తున్నావా?

అభివృద్ధికి ఆటంకం అని బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కాకుండా కేసీఆర్ చేస్తున్న డెవలప్మెంట్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కేంద్ర నిధులు ఎవడబ్బ సొమ్మని సీఎం అంటున్నారని, ఆ డబ్బు తెలంగాణ ప్రజల సొత్తు అని, కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్‌లో నుంచి నోట్లు తీసి ఇస్తున్నారా అని ప్రశ్నించారు బండి సంజయ్. డబుల్ బెడ్రూమ్, హరితహారం, స్టీట్ లైట్లు, కాళేశ్వరం అన్నీ కేంద్రం వాటాతో జరుగుతున్న పనులేనని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదని అని విమర్శించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో ప్రజలు మరణించినా, ఆర్టీసీ కార్మికులు ఆత్మత్యాగాలు చేసుకున్నా, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం స్పందించని మానవత్వం లేని సీఎం కేసీఆర్ అని మండిపడ్డారాయన. కేసీఆర్ సర్కారు లాఠీ దెబ్బలకు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటానని, ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాటం చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఘోరీ కడదామని, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు.

నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతా

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో భైంసాలో అల్లర్లు చేసిన తుక్డేగాళ్ల సంగతేంటో తేలుస్తానని చెప్పారు బండి సంజయ్. పసిపిల్లల్ని చేతిలో పట్టుకుని తమపై పెట్రోల్ పోసి చంపేస్తున్నారంటూ ఆడపడుచులు ఆర్తనాదాలు చేసే పరిస్థితి అక్కడ తలెత్తిందని, వాళ్లందరినీ పరామర్శించేందుకు భైంసా వస్తానని అన్నారు. ఆ అల్లర్లలో నిలువ నీడ లేకుండా పోయి చెట్ల కింద బతుకుతున్న నిరుపేదల్ని, అక్రమ కేసులతో జైళ్లలో పెట్టిన తమ్ముళ్లను కలిసి అండగా ఉంటామని భరోసా ఇస్తానన్నారు. నమ్మిన సిద్ధాతం కోసం, ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతానని, తాను రూటు మార్చేది ఉండదని, అడ్డదారులు తొక్కబోనని చెప్పారు. కేసీఆర్, ఎంఐఎం తుక్డేగాళ్ల సంగతేందో చూస్తానని అన్నారు బండి సంజయ్. బీజేపీపై మతతత్వ పార్టీ అని కేసీఆర్ ముద్ర వేస్తున్నారని, తానే పెద్ద హిందువని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూడాలన్నదే బీజేపీ సిద్ధాంతమని చెప్పారు.

కేసీఆర్ మాటలతో ప్రజలు ఆరోగ్యం కరాబు చేసుకోవద్దు

సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని, తెలంగాణను ఆయన నవ్వులపాలు చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. కరోనాపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఒక రోజు రాష్ట్రంలో కరోనా లేదని, మరో రోజు మాస్కుల లేకుండా తమ సిబ్బంది పని చేస్తారని చెప్పి… ఆ వెంటనే మళ్లీ మాస్కుల కోసం కేంద్రాన్ని అడుగుతామని చెబుతున్నారని అన్నారు. కేసీఆర్‌కు కరోనా భయం కాదని, బీజేపీ భయం పట్టకుందని అన్నారు. కరోనా ఏం చేయదని, పారాసెట్మాల్ వేసుకుంటే సరిపోతుందని ఆయన మాటలతో దేశం నవ్వుతోందన్నారు బండి సంజయ్. కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు ఆరోగ్యం కరాబు చేసుకోవద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రధాని మోడీ సూచనల్ని ప్రపంచం పాటించే స్థితిలో ఉన్నామని చెప్పారు.

Latest Updates