కేవలం 181 ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీ

bjps-machhlishahr-candidate-beats-bsp-rival-by-only-181-votes
  • యూపీలో బీజేపీ ఎంపీకి లీస్ట్ మెజార్టీ
  • భారీ మెజార్టీ రికార్డు కూడా ఆ పార్టీదే

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో సొంతగా 303 సీట్లు గెల్చుకుని, కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టు కున్న బీజేపీ, ఇంకో రికార్డు కూడా నెలకొల్పింది. 2019 ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీ సాధించిన ఇద్దరు అభ్యర్థులూ ఆ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. గుజరాత్ లోని నవ్ సారి లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ క్యాండేట్  సీఆర్ పాటిల్ తన సమీప ప్రత్యర్థిపై రికార్డు స్థాయిలో 6.89లక్షల ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు . ఇక్కడ మొత్తం 13,08,018 ఓట్లు పోల్ కాగా, పాటిల్ కు 9,72,739 ఓట్లు,కాంగ్రెస్ అభ్యర్థి భీంభాయి పటేల్ కు 2,83,071 ఓట్లు దక్కాయి.

ఇక లోయెస్ట్ మార్జిన్ విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్ లోని మచ్లీషహర్ లోక్ సభ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి  త్రిభువన్ రామ్ పై బీజేపీ క్యాండేట్ భోలానాథ్(బీపీ సరోజ్ ) కేవలం 181 ఓట్ల తేడాతో గట్టెక్కారు . శనివారం నాటికి ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడించడంతో హయ్యెస్ట్ , లోయెస్ట్ మార్జిన్ లపై ఆసక్తి నెలకొంది. సీఈసీ సునీల్ అరోరా నేతృత్వంలోని బృందం, లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల జాబితాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందజేయడం తెలిసిందే. 350 సీట్లు కైవసం చేసుకున్న ఎన్డీఏ పక్ష నాయకుడిగా నరేంద్ర మోడీ గురువారం(ఈ నెల 30) రెండో సారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు