కేసీఆర్ కమీషన్ ఏజెంట్

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం కేసీఆర్ కమీషన్ ఏజెంట్‌‌‌‌గా మారి కాంట్రాక్టర్ల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌‌‌‌ వెంకటస్వామి ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, దేనికీ నిధుల్లేవంటూనే కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌‌‌‌.. కేవలం తన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాది పాలనపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో వివేక్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, కేవలం ఓట్ల కోసమే అబద్ధాలు, మాయమాటలు చెప్పాడన్నారు. నియంతృత్వ పోకడతో కేసీఆర్ దాదాపు 30 మందికిపైగా ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 వేల మంది కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగించే ప్రయత్నం చేశాడని, ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గాడన్నారు. ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సబ్సిడీ స్కీమ్‌‌‌‌కు సంబంధించి దాదాపు 3 వేల కోట్ల రూపాయలను వ్యాపారులకు విడుదల చేయకపోవడం వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదన్నారు. కేవలం మేఘా కృష్ణారెడ్డి కంపెనీలకు కాంట్రాక్ట్ నిధుల్ని విడుదల చేస్తోన్న సర్కార్,  చిన్న చిన్న కాంట్రాక్టర్లకు చేసిన పనికి డబ్బులివ్వడం లేదన్నారు. దీంతో ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రెండు టీఎంసీల లిఫ్ట్​​ కెపాసిటీతో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇంకా ఒక్కచుక్క నీళ్లివ్వకుండానే మరో 11 వేల కోట్ల ఖర్చుతో మూడో టీఎంసీ పనులు చేపట్టడమేంటని నిలదీశారు. ఇదంతా కమీషన్ల కోసమే చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌‌‌‌ను సీఎం చేసేందుకే పార్టీలో సీనియర్లైన ఈటల, హరీశ్‌‌‌‌రావులను సీఎం కేసీఆర్‌‌‌‌ పక్కన పెడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌‌‌‌ వెంకటస్వామి ఆరోపించారు. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉప ఎన్నికలో ఓట్ల కోసమే రైతుబంధు డబ్బులు రాత్రికిరాత్రి విడుదల చేశారన్నారు. ప్రజలకే కేసీఆర్‌‌‌‌ తీరు అర్థమైందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిస్తోన్న కేసీఆర్‌‌‌‌కు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు.

Latest Updates