స్ట్రోక్‌ ఎందుకొస్తుంది?

స్ట్రోక్‌‌ ఎందుకొస్తుంది?

గుండె కవాటాల్లో రక్త ప్రవాహానికి రక్తం గడ్డకట్టిన అడ్డుపడినా, కొలెస్ట్రాల్‌‌ పెరిగి రక్త నాళాలు మూసుకుపోయినా రక్త ప్రవాహం నిలిచిపోతుంది. దీనినే మనం ‘హార్ట్‌‌ ఎటాక్‌‌ (మయోకార్డియల్‌‌ ఇన్‌‌ఫాక్షన్‌‌ )’ అంటున్నాం. ఇదే విధంగా మెదడులోని ధమనులు, సిరల్లో రక్త ప్రసరణకు ఆటంకాలుంటే కుప్పకూలి పోతారు. దీనినే ‘బ్రెయిన్‌‌ స్ట్రోక్‌‌’ లేదా ‘పక్షవాతం’ లేదా ‘స్ట్రోక్‌‌’ అంటారు. ఈ స్ట్రోక్‌‌ వల్ల కాళ్లు, చేతులు, పెదవులు, మెడ.. ఏదైనా చచ్చుబడిపోవచ్చు.

మెదడులో స్ట్రోక్‌‌ వచ్చే భాగాన్నిబట్టి అవయవం చచ్చుబడుతుంది. పక్షవాతం తీవ్రత కూడా మెదడులో స్ట్రోక్‌‌ వచ్చే భాగాన్ని బట్టే ఉంటుంది. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్‌‌ సమస్యలు కూడా ఈ రక్తనాళాల సమస్యల్ని పెంచుతాయి. ఈ సమస్యలతో బాధపడేవాళ్లు స్మోకింగ్‌‌ చేస్తే సమస్య మరింత ప్రమాదకరంగా ఉంటుంది. డయాబెటిస్‌‌, హైబీపీ, కొలెస్ట్రాల్‌‌.. ఈ మూడు సమస్యలు స్మోకింగ్‌‌తో సమానం. రక్తనాళ సమస్యలతో బాధపడేవాళ్లలో పొగతాగే వాళ్లే ఎక్కువ.

 రక్తం ఎందుకు నిలిచిపోతుంది?

రక్తం నిలిచిపోవడానికి చాలా కారణాలున్నాయి. రక్తం గడ్డకట్టడం, కొలెస్ట్రాల్‌‌ పెరిగి అడ్డుపడటం, రక్తం చిక్కబడటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. రక్తానికి గడ్డకట్టే సహజ లక్షణం ఉంది. కానీ ఇది గాయం అయినప్పుడే జరుగుతుంది. ఈ మెకానిజం దెబ్బతింటే ఈ సమస్య వస్తుంది.

స్టెంట్‌‌లతో పరిష్కారం ఉందా?

ఈ సమస్య ప్రారంభంలో మందులకు తగ్గుతుంది. తీవ్రంగా ఉంటే సర్జరీ చేయాలి. కొన్ని సమస్యలకు జీవితకాలం మందులు వాడాలి. కాళ్లు, చేతుల్లో వచ్చే సమస్యలకు స్టంట్స్‌‌ వేయొచ్చు. కానీ అవి మళ్లీ మళ్లీ బ్లాక్‌‌ అవుతాయి. కాలిలో స్టెంట్‌‌ కంటే బైపాస్‌‌ (ఒక చోట రక్తనాళం కత్తిరించి, బ్లాక్‌‌ అయిన చోట అమర్చడం) సర్జరీ చేయించుకోవడం మంచిది. బ్రెయిన్‌‌తో సంబంధం ఉండే రక్త నాళాల్లో (కెరోటిడ్‌‌ వెసల్స్‌‌) సమస్యలు ఉంటే స్టెంట్‌‌ వేస్తే బాగానే ఉంటుంది. కానీ బ్రెయిన్‌‌లో సమస్యలకు స్టెంట్‌‌ వేయడం సాధ్యం కాదు. ఇది ప్రయోగ దశలోనే ఉంది.

చాలామందిలో కాలిపై రక్తనాళాలు ఉబ్బి ఉంటాయి ఎందుకు?

కాలిలో ఉండే సిర(వీన్స్‌‌)లు బ్లాక్‌‌ అయితే ఈ సమస్య వస్తుంది. దీనిని ‘వెరికోస్‌‌ వీన్స్‌‌’ అంటారు. ఈ సమస్య హఠాత్తుగా రావచ్చు. నెమ్మదిగా పెరగొచ్చు. ఒక్కసారిగా వస్తే కాలిలో నొప్పి తెలుస్తుంది. వెంటనే గుర్తిస్తాం. నెమ్మదిగా పెరుగుతుంటే గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమస్య ఉన్న వాళ్లలో సాధారణంగా ఎత్తుగా కనిపించే ఒక నరానికి బదులు మూడు నాలుగు కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఒక జల్లెడలా ఉంటాయి. ఈ సమస్యను ‘వెరికోస్‌‌ వీన్స్‌‌’ అంటారు. ఈ సమస్య ఎక్కువ మందిలో ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌‌కు చూపించాలి. సమస్యను బట్టి మందులు వాడాలా? ఆపరేషన్‌‌ చేయాలా నిర్ణయిస్తారు. ఈ సమస్య చేతుల్లో కూడా రావొచ్చు.

గాయం కాకుండానే రక్తం గడ్డకడుతుందా?

వీన్స్‌‌లో రక్తం గడ్డకడితే రక్త నాళాలు బ్లాక్‌‌ అవుతాయి. ఈ సమస్య ఎక్కువగా కాళ్లలో వస్తుంది. దీనిని ‘డీప్‌‌ వీన్‌‌ థ్రాంబోసిస్‌‌’ అంటారు. సిరలు రక్తాన్ని శరీరం నుంచి గుండెకు తీసుకుపోతాయి. ఒక్కోసారి చెడు రక్తంతోపాటు గడ్డ కట్టిన రక్తం కూడా గుండెకు చేరుతుంది. అప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యను గుర్తించగానే డాక్టర్‌‌ని కలవాలి. రక్తంలోని గడ్డలు కరిగే మందులు వాడితే గుండెకు ప్రమాదం ఉండదు.

కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లకే కాళ్ల నరాలు ఉబ్బి ఉంటాయెందుకు?

కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ నిలిచిపోతుంది. కూర్చుని ఉన్నప్పుడు మెదడు, చేతుల నుంచి గుండెకు రక్త ప్రసరణ ఉంటుంది. కానీ కాళ్ల నుంచి గుండెకు సిరల ద్వారా రక్త ప్రసరణ సరిగా జరగదు. కదలకుండా ఉండడం వల్ల కండరాలు ఒత్తుకుపోతాయి. గురుత్వాకర్షణ ప్రభావం కూడా ఉంటుంది. కదలకుండా ఆఫీసులో ఎనిమిది గంటలు కూర్చోవడం, విమానాల్లో గంటలపాటు ప్రయాణం చేయడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి పేరుతో కదలకుండా ఉన్న వాళ్లకు సిరలు ఉబ్బుతాయి. కదలకుండా ఎక్కువ గంటలు కూర్చోకూడదు. కాళ్లను అప్పుడప్పుడూ కదిలిస్తుండాలి.

విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు అరగంటకు ఓసారి కుర్చీలోంచి లేచి అటూ ఇటూ నడవాలి. ప్రమాదంలో గాయపడ్డ వాళ్లు, ఆపరేషన్‌‌ చేయించుకున్న వాళ్లు విశ్రాంతి తీసుకోవాలి. కానీ విశ్రాంతి పేరుతో శరీరానికి కదలిక లేకుండా చేయకూడదు. ఇలా చేస్తే కండరాల మధ్య కదలిక లేక రక్త ప్రవాహం కూడా తగ్గుతుంది. సిరలు (వీన్స్‌‌) ఇలా బ్లాక్‌‌ అవడాన్ని వీన్స్‌‌ థ్రాంబోసిస్‌‌ అంటారు. ధమనుల్లోనూ ఇలాంటి ఆటంకాలు ఉంటాయి. ఈ సమస్యను ఆర్టీరియల్‌‌ థ్రాంబోసిస్‌‌ అంటారు.

Latest Updates