కార్మికుల ప్రయోజనం కోసం పోరాడే సంఘం బీఎంఎస్

  • బీజేపీ నేతలు రాంచందర్ రావు, వివేక్ వెంకటస్వామి
  • బీఎంస్ లో చేరిన టీబీజీకేఎస్ నాయకులు

దేశంలో కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘం బీఎంఎస్ ఒక్కటేనని బీజేపీ నేతలు ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘమైన బీఎంఎస్ ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా లేకుండా కేవలం కార్మిక వర్గ ప్రయోజనాల కోసమే పని చేస్తోందన్నారు. కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించినా పోరాడేది బీఎంఎస్ మాత్రమేనన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్ ) నేతలు జనగామ శ్రీనివాస్ గౌడ్, కొయ్యాడ రమేష్​గౌడ్ బుధవారం హైదరాబాద్ లోని బీఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో బీఎంఎస్ లో చేరారు. సింగరేణి కోల్ మైన్స్ బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు వారికి కండువాలు కప్పి బీఎంఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం వారు వివేక్ వెంకటస్వామిని కూడా కలిశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు, వివేక్ మాట్లాడుతూ… సింగరేణి ఏరియాలో బీఎంఎస్ పటిష్టం కావడం కార్మికులకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సింగరేణి యాజమాన్యంతో కలిసిపోవడంతో అందులో పనిచేసే నాయకులు బీఎంఎస్ లో చేరడం హర్షణీయమన్నారు. యూనియన్ ను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్ లకు సూచించారు. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రాజు వర్మ, ప్రధాన కార్యదర్శి రవిశంకర్, పర్లపల్లి రవి, పల్లె శ్రీనివాస్, దొడ్ల సతీష్, బాలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates