లాక్ డౌన్ లోనే ఎగ్జామ్ పేప‌ర్ల స్పాట్: కేంద్రం

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌మంతా లాక్ డౌన్ విధించింది. దీంతో దేశంలో అన్ని కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. ప్ర‌యాణాలు ఆగిపోయాయి. ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీల్లో ప‌నుల‌కు బ్రేక్ ప‌డింది. స్కూళ్లు, కాలేజీలు మూత‌పడ్డాయి. అయితే తొలుత ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ పెట్ట‌గా.. క‌రోనా కేసులు భారీగా పెర‌గ‌డంతో మే 3 వ‌ర‌కూ పొడిగించింది. ఇప్పుడు మ‌రోసారి పొడిగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ర‌మేశ్ పొఖ్రియాల్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం ట్విట్ట‌ర్ లైవ్ లో విద్యార్థులు, త‌ల్లిదండ్రుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు విద్యార్థులు క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన ప‌రీక్ష‌లు, రిజ‌ల్ట్స్ గురించి అడిగారు. లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌ విష‌యంలో త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు కేంద్ర మంత్రి. ఇప్ప‌టికే పూర్త‌యిన బోర్డ్ ఎగ్జామ్ పేప‌ర్స్ స్పాట్ వ్యాల్యుయేష‌న్ ను లాక్ డౌన్ లోనే చేప‌ట్టి.. ఫ‌లితాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

ఏప్రిల్ 28న‌ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల‌తో భేటీ..

మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 28న‌) అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం కానున్న‌ట్లు చెప్పారు కేంద్ర మంత్రి ర‌మేశ్ పొఖ్రియాల్. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఈ విద్యా సంవ‌త్స‌రంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తామ‌ని చెప్పారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిణామాల‌ను మ‌రికొన్నాళ్ల పాటు ఎదుర్కోవాల్సివ‌స్తుంద‌ని అన్నారు. వందేళ్ల క్రితం ప్లేగు వ్యాధి విజృంభించిన‌ప్పుడు దాన్ని త‌రిమికొట్ట‌గ‌లిగామ‌ని, స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఇప్పుడు క‌రోనాను కూడా అంతం చేయ‌గ‌ల‌మ‌ని చెప్పారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు అంతా వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌, సోష‌ల్ డిస్టెన్సింగ్ వంటివి త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచించారు. మ‌న ఆరోగ్యం మ‌న చేతుల్లోనే ఉంద‌ని, ఈ మ‌హ‌మ్మారి దీర్ఘ‌కాలం కొన‌సాగ‌బోద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

24 గంట‌లూ పిల్ల‌ల‌పై చ‌దువు ఒత్తిడి వ‌ద్దు

లాక్ డౌన్ స‌మ‌యంలో పిల్ల‌ల‌కు ఇంట‌ర్నెట్, టెలిఫోన్, సోష‌ల్ మీడియా ద్వారా సాయ‌ప‌డుతున్న టీచ‌ర్ల‌కు థ్యాంక్ చెప్పారు కేంద్ర మంత్రి ర‌మేశ్. ఆన్ లైన్ క్లాసుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌యం, దీక్ష‌, స్వ‌యం ప్ర‌భ‌, ఈ-పాఠ‌శాల లాంటి పోర్ట‌ల్స్ ను లాంచ్ చేసిన‌ట్లు తెలిపారు. అలాగే టీవీ, రేడియోల ద్వారా కూడా విద్యార్థులు పాఠాలు విని ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావొచ్చన్నారు. లాక్ డౌన్ లో పిల్ల‌ల‌పై 24 గంట‌లూ చ‌దువాలంటూ ఒత్తిడి చేయొద్ద‌ని త‌ల్లిదండ్రుల‌కు సూచించారు. అయితే పెండింగ్ లో ఉన్న బోర్డ్ ఎగ్జామ్స్ ను పూర్తి చేసేందుకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాల‌ని చెప్పారాయ‌న‌.

Latest Updates