రూ.11,900 కోట్ల నిధులు కావాలంటున్న బీఓబీ

bob-plans-to-raise-rs-11900-crore-via-share-sale-in-fy20
  • వ్యాపార విస్తరణ కోసమే అని ప్రకటన
  • ఈఎస్ పీఎస్‌ ద్వారా రూ.1,500 కోట్ల సేకరణ
  • ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్ అవకాశం.

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా (బీఓబీ) రూ.11,900 కోట్ల నిధులు సేకరించాలని నిర్ణయించింది. షేర్ల అమ్మకంతోపాటు ఎంప్లాయి షేర్‌‌ పర్చేజ్‌‌ స్కీమ్‌‌ ద్వారా ఈ మూలధనాన్ని సమీకరించనుంది. వ్యాపార విస్తరణ కోసం వీటిని ఉపయోగిస్తారు. బీఓబీ ఎంప్లాయి షేర్‌‌ పర్చేజ్‌‌ స్కీమ్‌‌ (బీఓబీ–ఈఎస్‌‌పీఎస్‌‌) ద్వారా రూ.1,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఈఎస్‌‌పీఎస్‌‌ కింద 10 కోట్ల షేర్లు ప్రతిపాదించారు. నిధుల సమీకరణ కోసం వీటి సంఖ్యను 15 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఒక్కో షేరు ముఖవిలువ రెండు రూపాయలు. గత ఆర్థిక సంవత్సరానికి తయారు చేసిన క్యాపిటల్‌‌ ప్లాన్‌‌కు అనుగుణంగానే ఈఎస్‌‌పీఎస్‌‌ ఉంటుందని, షేర్ల అమ్మకం ద్వారా రూ.11,900 కోట్లు సేకరిస్తామని వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)లో బీఓబీ తన వాటాదారులకు వెల్లడించింది.

మిగిలిన మూలధనాన్ని క్యాలిఫైడ్ ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ ప్లేస్‌‌మెంట్‌‌ (క్విప్‌‌) లేదా ఫాలో ఆన్‌‌ పబ్లిక్‌‌ ఆఫర్‌‌ (ఎఫ్‌‌పీఓ) లేదా రైట్స్‌‌ ఇష్యూ వంటి కార్యక్రమాల ద్వారా సేకరిస్తారు. అవసరమనుకుంటే వీటిలో రెండు మూడు కార్యక్రమాలను ఏకకాలంలో అమలు చేస్తారు. ఆథరైజ్డ్‌‌ క్యాపిటల్‌‌ పరిమితి రూ.మూడు వేల కోట్లకు లోబడే నిధులను తీసుకుంటారు. ఈ నెల 21న నిర్వహించే ఏజీఎంలో ఈ విషయమై వాటాదారులు నిర్ణయాలు తీసుకుంటారు. బీఓబీలో విలీనమై దేనా బ్యాంక్‌‌, విజయబ్యాంక్‌‌ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించడానికే ఈఎస్‌‌పీఎస్‌‌ పరిమాణాన్ని పెంచినట్టు సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. దీనివల్ల ఈక్విటీ క్యాపిటల్‌‌ను, క్యాపిటల్‌‌ అడెక్వసీని పెంచుకోవడానికి, సాధారణ వ్యాపారానికి నిధులు అందించడానికి వీలు కలుగుతుందని అన్నారు. దీనివల్ల ఉద్యోగులకూ ప్రయోజనాలు కలుగుతాయని, సంస్థ పురోగతి కోసం వాళ్లూ తమ వంతు సాయం చేసినట్టు అవుతుందని వివరించారు. వారికి లాభాల్లోనూ వాటాలు వస్తాయని చెప్పారు.

విలీనం ఇలా..

బీఓబీ, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌‌ల విలీనం ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ప్రక్రియ రెండేళ్లలో పూర్తవుతుందని అధికారులు చెప్పారు.   ఈ బ్యాంక్‌‌ల ఇన్‌‌ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్‌‌ఫామ్‌‌ ఇంటిగ్రేషన్‌‌కే ఏడాది పట్టే అవకాశాలున్నాయని బీఓబీ సీనియర్ అధికారులు అంచనా వేశారు. మరో ఏడాది ఇతర ప్రక్రియలకు, సిస్టమ్స్‌‌కు పడుతుందని పేర్కొన్నారు. తాత్కాలిక కాలానికి ఈ మూడు సంస్థలు తమ బ్రాండింగ్‌‌నే కొనసాగించనున్నాయి. ప్రస్తుత కార్యకలాపాలకు అవాంతరాలను కాస్త తగ్గిస్తూ.. క్రమక్రమంగా వీటిని కొత్త బ్రాండ్‌‌లోకి మార్చుతారు. క్యాపిటల్ పరంగా చూస్తే.. బ్యాంక్‌‌కు అయ్యే అదనపు ఖర్చులు, కనీస నియంత్రణ మూలధన అవసరాల కోసం ప్రభుత్వం రూ.5,042 కోట్లను  ఇచ్చింది. తొలి క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్‌‌ బ్యాలెన్స్ షీటుపై ఒత్తిడి ఉంటుందని, ఆ తర్వాత క్రమక్రమంగా దాని ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. విలీనం కారణంగా ఎస్‌‌బీఐ తర్వాత దేశీయంగా రెండో అతిపెద్ద బ్యాంక్‌‌గా బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బరోడా అవతరించింది. మొదటిస్థానంలోని ఎస్‌‌బీఐ 9500కు పైగా బ్రాంచులు, 13,400 ఏటీఎంలు, 85వేల మంది ఉద్యోగులతో 12 కోట్ల మంది కస్టమర్లకు ఇది సేవలందిస్తోంది. విలీనం వల్ల వాటాదారులందరికీ గణనీయమైన ప్రయోజనం చేకూరనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.  విలీనంతో బీఓబీ వ్యాపార విలువ రూ.15 లక్షల కోట్లను దాటింది.

డిపాజిట్లు రూ.8.75 లక్షల కోట్లకు, అడ్వాన్స్‌‌లు రూ.6.25 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌లను అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు తీర్చిదిద్దడానికి కేంద్రం పలు సంస్కరణలను అమలు చేస్తున్నది.   ఇదిలా ఉంటే,  మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌‌‌లో బీఓబీ రూ.991 కోట్ల నికర నష్టాలను రికార్డు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌‌‌‌లో బ్యాంక్ నికర నష్టాలు రూ.3,102.34 కోట్లుగా ఉండేవి.  గతేడాది కంటే  నష్టాలను చాలా వరకు తగ్గించుకోగలిగింది. సీక్వెన్షియల్‌‌గా చూసుకుంటే, మూడో క్వార్టర్‌‌‌‌లో మాత్రం బ్యాంక్ రూ.471.25 కోట్ల నికర లాభాలను పోస్ట్ చేసింది. ప్రొవిజన్లు పెరగడంతో 2018-–19 ఆర్థిక సంవత్సర నాలుగో క్వార్టర్‌‌‌‌లో స్టాండలోన్‌‌ బేసిస్‌‌లో బ్యాంక్‌‌ రూ.991 కోట్ల నికర నష్టాలను రికార్డు చేసింది.

Latest Updates