ఈటల ఎపిసోడ్‌పై బొడిగె శోభ స్పందన.. ఆరోగ్యశాఖను తీసుకోవడం తుగ్లక్ చర్య

 ఈటల ఎపిసోడ్‌పై బొడిగె శోభ స్పందన.. ఆరోగ్యశాఖను తీసుకోవడం తుగ్లక్ చర్య
  • ఈటల కట్టప్ప పాత్ర నుంచి బయటకురా
  • బడుగుల కోసం బయలుదేరితే ప్రజలు ఈటల వెనుక ఉంటారు –బొడిగె శోభ

కరీంనగర్: ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఘాటుగా స్పందించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఈటల రాజేందర్ నుంచి ఆరోగ్య శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవడం తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. కేసీఆర్ కరోనా రోగి.. అలాంటాయన ఇప్పుడు ప్రజల్ని జాగ్రత్తగా ఎలా చూసుకుంటారో అర్థం కావడం లేదన్నారు. మొత్తం క్యాబినెట్ మంత్రులలో ఈటల రాజేందర్ ఒక్కడే కరోనా కట్టడి కోసం రోజుకు 18 గంటలు కష్టపడ్డారని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ సహా ఏ మంత్రీ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను సందర్శించలేదని గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీ మూల స్థంభాలలో ఒకడైన ఈటల రాజేందర్ తామే పార్టీ కి ఓనర్లమంటూ ప్రకటించినందుకే సీఎం, ఆయన కుటుంబం కక్షకట్టి ఇదంతా చేస్తున్నారని బొడిగె శోభ ఆరోపించారు. 
‘‘దొర మీ బాంచన్’’ అంటూ కాళ్ల దగ్గర పడుంటేనే పదవులుంటాయి
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ లు "దొర మీ బాంచన్" అంటూ కేసీఆర్ కాళ్ల దగ్గర పడుంటేనే క్యాబినెట్ లో బెర్తులు ఉంటాయని లేకపోతే అంతేసంగతులని బొడిగె శోభ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్లాన్ ప్రకారం ఎన్నికలన్నీ అయిపోయాక ఈటల రాజేందర్ పై కుట్ర చేసి పదవి లాక్కున్నారని ఆరోపించారు. ఏనాడు మంత్రులకు ఎమ్మెల్యేలకే నెలల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వని నీవు ఓ నలుగురు రైతులకు  అపాయింట్మెంట్ ఇచ్చావంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ని బయటికి పంపించేందుకు రెండేళ్లుగా కుట్ర జరుగుతోందని, సీనియర్ మంత్రి అయిన ఈటలను పక్కన పెట్టి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే అందరు అడుగుతారనే ఇదంతా చేశారని ఆమె విమర్శించారు. ‘‘రాజేందరన్నా.. ఎన్నో అవమానాలు భరిస్తూ కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మి కట్టప్ప లాగ ఇంత కాలం పని చేశావు.. ఇక చాలు అక్కడి నుంచి బయటికి రా.. నీవు నమ్మినందుకు కెసిఆర్ బ్రహ్మాండమైన బహుమతి నీకు ఇచ్చాడు.. రాజేందరన్నా.. నీవే మొదలు కాదు, చివర కూడా కాదు.. ఇప్పటికే ఎందరో ఉద్యమకారులను పార్టీ నుంచి బయటికి పంపించాడు.. ఇప్పుడు పార్టీలో మిగిలిన వాళ్లంతా దొంగలు, లంగలే’’ అని బొడిగె శోభ విమర్శించారు. 
కట్టప్ప పాత్ర నుంచి బయటకు రా
‘‘ఇప్పటికైనా కట్టప్ప పాత్ర నుంచి బయటికి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం బయలుదేరు.. తెలంగాణ ప్రజలు నీ వెనుక ఉంటారు.. ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్న నాయకుడివి నీవు.. ఇంకా అవమానాలు భరించకు..’’ అని ఈటెలకు బొడిగె శోభ సూచించారు. కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా, నీ కొడుకు కేటీఆర్ తో సహా ఆరోపణలు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలందరిపై విచారణ జరిపించు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఆయన తండ్రి కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మీ అత్తగారి ఊరు కొదురుపాకలో చేస్తున్న భూ కబ్జాలపై, దందాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మచ్చలేని ఓ బీసీ బిడ్డ ఈటెలపై జరిపించినంత స్పీడ్ గా మిగతా వారిపై కూడా విచారణ జరగాలన్నారు. ఓ తండ్రి పాత్ర పోషించి మొదటి విచారణ కుదురుపాక నుంచి ప్రారంభించాలన్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి పోరాటాలు చేసి తెలంగాణ సాధిస్తే.. దొంగలంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, మీకు తెలంగాణ ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని బొడిగె శోభ హెచ్చరించారు.