బోడోలకు భరోసా

బోడోలకు భరోసా

తమకంటూ ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం కోసం అస్సాంలో 50 ఏళ్లకు పైగా బోడోలు చేస్తున్న పోరాటం మొన్నే ముచ్చటగా మూడో మలుపు తిరిగింది. ఆర్థిక, రాజకీయ  అండదండలు అందిస్తామన్న మోదీ సర్కారు హామీలను ఆ గిరిజనులు స్వాగతించారు. ఆయుధాలు వదిలేసి శాంతిబాటలో నడిచేందుకు ముందుకొచ్చారు. డీల్​పై సంతకాలు చేశారు. ఈ పరిణామం బోడోల ప్రత్యేక భాష రక్షణకు గ్యారెంటీ ఇస్తోందని; కల్చర​ల్, రీజనల్​​ సమస్యలకు పరిష్కారం కూడా చూపుతుందని పొలిటికల్​ పండితులు చెబుతున్నారు.

ఈశాన్య రాష్ట్ర్రాల్ని మెయిన్​ లాండ్​తో కలపాలన్నది బీజేపీ ప్రభుత్వాల ప్రయత్నం. వాజ్​పేయి హయాంలో బోడోలాండ్​కి ఆల్టర్నేటివ్​గా టెరిటోరియల్​ కౌన్సిల్​ని ఏర్పాటుచేస్తే… ఇప్పుడు మోడీ సర్కారు బోడోల అభివృద్ధికి శాంతి ఒప్పందం చేసుకుంది.  అస్సాంలో చాలాకాలంగా నలుగుతున్న సమస్యలను ఎన్డీయే ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చక్కబెడుతోంది. ఎన్నార్సీని కొలిక్కి తెచ్చినట్లే బోడోలకు భరోసా కల్పించటంలోనూ విజయం సాధించింది. ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం కావాలని 50 ఏళ్లుగా అక్కడి ట్రైబల్స్​ బలంగా కోరుతున్నారు. ఈ ప్రధాన డిమాండ్​పై వాళ్లు పట్టుబట్టకుండా… చాలా చాకచక్యంగా  శాంతి ఒప్పందానికి ఒప్పించింది. వెపన్స్​ని​ విడిచిపెట్టి, అభివృద్ధి సాధించడానికి ఈ అగ్రిమెంట్​ అన్ని విధాలా బాటలు వేయనుంది.

బోడోలు అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ లోయకి ఉత్తరాన నివసించే అతి పెద్ద గిరిజన తెగకు చెందినవారు.  రాష్ట్ర జనాభాలో వీళ్లు దాదాపు 28 శాతం ఉంటారు. తమ ప్రాంతాన్ని వేర్వేరు ఐడెంటిటీలు గల కమ్యూనిటీలు ఆక్రమించి, తమ కల్చర్​ని పాడు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే 1966లో ‘ప్లెయిన్స్ ట్రైబల్​ కౌన్సిల్​ ఆఫ్​ అస్సాం (పీటీసీఏ)’ని ఏర్పాటు చేశారు. ‘ఉదయాచల్​’ పేరిట​ టెరిటరీ కావాలనే డిమాండ్​ చేశారు.

ఈ పోరాటం 1980ల్లో వయొలెన్స్​కి దారి తీసింది. బోడోలు, సెక్యూరిటీ బలగాలకు​ మధ్య జరిగిన గొడవల్లో వందల సంఖ్యలో అమాయక గిరిజనులు చనిపోయారు. ‘ప్రత్యేక బోడోలాండ్​’ ఉద్యమంలో మూడు గ్రూపులు కీలక పాత్ర పోషించాయి. మొదటి గ్రూపు నేషనల్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​ ఆఫ్​ బోరోలాండ్​ (ఎన్​డీఎఫ్​బీ)  ప్రత్యేక బోడో  రాష్ట్రం కోసం డిమాండ్​ చేయగా, రెండో గ్రూపు బోడో లిబరేషన్​ టైగర్స్ (బీఎల్టీ) గ్రేటర్​ అటానమీని కోరింది. 1987లో ఏర్పడ్డ మూడో గ్రూపు ఆల్​ బోడో స్టూడెంట్స్​ యూనియన్ (ఏబీఎస్​యూ) రాజకీయ అధికారాలు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం పోరాడింది.

ఏం సాధించారు?

1993లో కుదిరిన మొదటి ఒప్పందం తర్వాత బోడో అటానమస్​ కౌన్సిల్ ​(బీఏసీ) ఏర్పడింది. దీనికి 38 అంశాల్లో అధికారాలను కట్టబెట్టారు. 40 మంది సభ్యులు గల ఈ కౌన్సిల్​లో ఐదుగురిని ప్రభుత్వమే నియమించింది. మిగిలిన స్థానాలను ఎస్టీలకు రిజర్వ్​ చేశారు. బోడోల్లోని ఒక సెక్షన్​ ప్రజలు ఈ డీల్​ని వ్యతిరేకించి 1996లో బీఎల్టీని ఏర్పాటుచేశారు. ఆయుధాలు చేతబట్టి ఆరేళ్ల పాటు భయానక వాతావరణం సృష్టించారు. కేంద్రంతో 2003లో కుదిరిన రెండో ఒప్పందంలో భాగంగా 2,641 మంది వెపన్స్​ విడిచిపెట్టారు. బోడోలాండ్​ టెరిటోరియల్​ కౌన్సిల్ ​(బీటీసీ) ఏర్పడింది. బీఎల్టీ కేడర్​ని సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్ ​(సీఆర్పీఎఫ్​)లోకి తీసుకున్నారు. పొలిటికల్​ పవర్​ విషయంలో బీఏసీ కన్నా బీటీసీయే బెటరని ఉద్యమ నేతలు భావించారు. రాజకీయాధికారాలు గల బీటీసీని బోడో పీపుల్స్​ ఫ్రంట్​(బీపీఎఫ్​) తన కంట్రోల్​లోకి తీసుకుంది. దీంతో సాయుధ పోరాటం సమసిపోతుందని ఆశించినా అలా జరగ లేదు. ఉద్యమాన్ని ఏబీఎస్​యూ కొనసాగించింది. ఎన్డీఎఫ్​బీ నాలుగు వర్గాలుగా విడిపోయింది. ఈ సంస్థలన్నీ కలిసి మోడీ సర్కారుతో చర్చలు జరిపి మూడో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఇది మూడో అగ్రిమెంట్​

బోడోలాండ్​ పోరులో వందల మంది ప్రాణత్యాగం చేశారు. దీంతో వయొలెన్స్​కి ఫుల్​స్టాప్​ పెట్టడానికి గతంలోనూ చాలా ప్రయత్నాలు జరిగాయి. గడచిన 27 ఏళ్లలో కేంద్రం గిరిజనులతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవటం ఇది మూడోసారి. తొలిసారి(1993లో)  ఆల్​ బోడో స్టూడెంట్స్​ యూనియన్​ (ఏబీఎస్యూ)తో, రెండోసారి (2003లో) బోడో లిబరేషన్​ టైగర్స్ ​(బీఎల్టీ)తో ఒప్పందాలు చేసుకుంది. లేటెస్ట్​ పీస్​ అగ్రిమెంట్​లో నేషనల్​ ఫ్రంట్​ ఆఫ్​ బోడోలాండ్​ తోపాటు ఏబీఎస్యూనికూడా భాగస్వామిని చేయటం విశేషం. మొదటి డీల్​ మూలాన కొన్ని రాజకీయ అధికారాలతో బోడోలాండ్​ అటానమస్​ కౌన్సిల్​ ఏర్పాటుకు ఉపయోగపడగా, రెండో ఒప్పందం బోడోలాండ్​ టెరిటోరియల్​ కౌన్సిల్​(బీటీసీ)కి బీజం వేసింది. బీటీసీ పరిధిలోకి ఉదల్​గురి, చిరంగ్​, బస్కా, కాక్రఝార్​ జిల్లాలను తెచ్చారు.