2 నెలల పసికందును చంపేసి.. కిడ్నాప్ నాటకమాడిన తల్లి

నవమాసాలు కడుపులో మోసి.. ఈ లోకంలోకి తెచ్చిన ప్రాణాన్ని తన చేతులతోనే కడతేర్చింది. రెండు నెలల క్రితం తాను ప్రాణం పోసి కూతురిని కర్కశంగా చంపేసింది ఆ తల్లి. బిడ్డ శవాన్ని మాయం చేసి.. ఆ తర్వాత తప్పించుకోవడానికి తానే పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఎవరో కిడ్నాప్ చేశారంటూ డ్రామాకు తెర తీసింది. రంగంలోకి దిగి దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు 24 గంటలు గడిచే లోపే కన్న కూతురి ప్రాణం తీసిన ఆమెను కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా శివారు జరిగింది.

కోల్‌కతాలోని బెలియాఘటా ప్రాంతంలో నివసించే ఓ మహిళ ఆదివారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన రెండు నెలల కూతురిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసింది. ఓ యువకుడు వచ్చి తనను కొట్టి.. ఒడిలో ఉన్న చిన్నారిని లాక్కుని వెళ్లిపోయాడంటూ పోలీసుల దగ్గర కంటతడి పెట్టుకుంది. ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఆమె ఉండే ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డు మొదలు చుట్టుపక్క వాళ్లను విచారించారు. కానీ కొత్తవాళ్లు ఎవరూ రాలేదని చెప్పారు. దీంతో సోమవారం ఉదయం ఆ తల్లిని కూడా పిలిచి ప్రశ్నించారు. ఆమె తడబడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు గట్టిగా మందలించడంతో అసలు విషయం బయటపెట్టిందామె. బిడ్డను తానే చంపి ఇంటికి దగ్గరలో ఉన్న మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆ పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి పంపారు. ఆమెను అరెస్టు చేశారు. అయితే ఆమె ప్రసవం తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌లో ఉందని, అందువల్లే ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest Updates