పర్ఫెక్ట్‌ లీ సూపర్‌‌ విమెన్

bollywood-heroine-sameera-reddy-health-care

అందంగా ఉండటమంటే ఎట్లుండాలి?

తెల్లటి రంగు ఉండాలా?
సన్నగా ఉండాలా?

ముఖం మీద ఏం మచ్చలు ఉండొద్దా?

అట్ల ఉంటేనే అందమా? మనం మనలాగా ఉంటే అందం కాదా? మేకప్‌‌ వేసుకోకుంటే అందంగా ఉన్నట్టు కాదా? నేచురల్‌‌గా ఉంటే అందం కాదా? ఇట్లాంటి ప్రశ్నలు తనకు తానే వేసుకొని ఒక సమాధానంతో ముందుకొచ్చింది సమీరారెడ్డి. హీరోయిన్‌‌ సమీరారెడ్డి గుర్తుంది కదా? ‘జై చిరంజీవ’, ‘సూర్య సన్నాఫ్‌‌ కృష్ణన్‌‌’ సినిమాల్లో నటించిన హీరోయిన్!

సమీరా చెప్తున్న ఒక మాట
ఇప్పుడు ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ట్రెండింగ్‌‌.

‘పర్ఫెక్ట్‌‌లీ ఇంపర్ఫెక్ట్‌‌’ అని ఇంగ్లీష్‌‌లో ఒక మాట ఉంది. దానర్థం మన బాడీ కొన్ని ఇంపర్ఫెక్షన్స్‌‌తో (అంటే కొన్ని లోపాలతో) ఉన్నా, దాన్ని  మనం యాక్సెప్ట్‌‌ చెయ్యాలని. కళ్లు అందంగా ఉండకపోవచ్చు, కొంచెం లావు ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, పెద్ద పొడవు ఉండకపోవచ్చు.. అందమంటే ఇదే అనుకునే ప్రత్యేకతలు ఏం లేకున్నా అదీ అందమే. మనం మనలా ఉండటమే అందం. అందుకే ‘ఆ ఇంపెర్ఫక్షన్సే పర్ఫెక్ట్‌‌.. పర్ఫెక్ట్‌‌లీ పర్ఫెక్ట్‌‌’ అని చెప్పుకుంటారు ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవాళ్లు.

బాలీవుడ్‌‌లో సెటిలైన మన తెలుగమ్మాయి సమీరారెడ్డి సరిగ్గా ఇప్పుడు ఈ మాట చెప్పి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్‌‌ చేస్తున్న ఫొటోలతో.. సినిమాలు వదిలేసిన ఐదారు సంవత్సరాలకు మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

మనం మనలా ఉండాలి

2014లో మోటార్‌‌సైకిల్‌‌ బిజినెస్‌‌మెన్‌‌ అక్షయ్‌‌ వార్ధేని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమీరారెడ్డి.. అప్పట్నుంచి సినిమాలకు దూరమైంది. అక్షయ్‌‌, సమీరాలకు 2015లో ఒక బాబు పుట్టాడు. అప్పట్నుంచి పూర్తిగా కుటుంబానికే పరిమితమైపోయింది సమీర. హీరోయిన్‌‌గా ఉన్నప్పటి డైట్‌‌ మిస్‌‌ చెయ్యడం, బాబు పుట్టడం, ఇంటికే పరిమితమవ్వడంతో సమీర కాస్త లావైంది. ఇదంతా 2015లో జరిగింది.

ఆ రోజులను తల్చుకుంటూ.. ‘‘2015 మే నెలలో బాబు పుట్టిన తర్వాత 105 కేజీల బరువున్నా. అప్పట్లో బయటికి రావాలన్నా భయమేసేది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వెక్కిరిస్తారేమో, నవ్వుకుంటారేమో అని అస్సలు ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టలేదు. రెండేళ్లు నేను బరువు తగ్గలేదు. అదొక నరకంలా ఉండేది. నా కాన్ఫిడెన్స్‌‌ మొత్తం దెబ్బతింది. అవన్నీ తట్టుకొని నిలబడి, యోగా, వర్కవుట్స్‌‌ చేయడం మొదలుపెట్టా. రెండేళ్లలో నేను మళ్లీ ఇంతకుముందులా మారిపోయా.

ఇదంతా నేను ఇప్పుడెందుకు చెబుతున్నానంటే, మనం మనలా ఉండాలి. ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే తగ్గేందుకు వర్కవుట్స్‌‌ చేస్తాం. ఆరోగ్యంగా ఉండటానికి యోగా చేస్తాం. దానికంటే ముందు, మనం బాగోలేం అని, ఎవరో నవ్వుతారని ప్రపంచానికి భయపడాల్సిన పని లేదు. మనం మనలా ఉంటే అది మనకు అన్నివిధాలా ధైర్యాన్నిస్తుంది’’ అని చెప్పింది సమీరారెడ్డి.

ఇప్పుడు బేబీ బంప్‌‌తో..!

సమీరా రెడ్డి శుక్రవారం నాడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజులనుంచి సమీరా రెడ్డి.. గర్భవతిగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూవచ్చింది.

ఏప్రిల్‌‌ నెలలో బరువు తగ్గి ఇంతకుముందులాగే కనిపించిన సమీర, అప్పట్నుంచి ‘పర్ఫెక్ట్‌‌లీ ఇంపర్ఫెక్ట్‌‌’ మాటను ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం సమీరారెడ్డి తొమ్మిది నెలల ప్రెగ్నెంట్‌‌. ‘‘మామూలుగా ప్రెగ్నెంట్‌‌ అవ్వగానే బాడీలో మార్పులొస్తాయి. హార్మోనల్‌‌ చేంజెస్‌‌ ఉంటాయి. లావు అవుతాం. దానికి భయపడి అందరికీ దూరంగా ఉండక్కర్లేదు. హ్యాపీగా, హెల్దీగా ఉండండి. మీ బేబీ బంప్‌‌ని చూపించండి’’ అంటూ ప్రెగ్నెన్సీతోనే స్విమ్‌‌ చేస్తూ, స్పెషల్‌‌గా ఫొటోషూట్‌‌ చేసింది.

ఈ ఫొటోలు సోషల్‌‌ మీడియాలో బాగా వైరల్‌‌ అయ్యాయి. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్సర్‌‌సైజ్‌‌ చేయడంలో రిస్క్‌‌ ఉండదని, స్విమ్మింగ్‌‌ కూడా చెయ్యొచ్చని, కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సలహా ఇచ్చింది. ప్రెగ్నెన్సీ టైమ్‌‌లో తొమ్మిదో నెల వచ్చిందంటే భయపడే అమ్మాయిలకు ఒక పాజిటివ్‌‌ వైబ్రేషన్స్‌‌ ఇవ్వడమే ఈ ఫొటోషూట్‌‌ ఉద్దేశమని చెప్పింది.

నో ఫిల్టర్‌‌.. నో మేకప్‌‌..

‘‘ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఫొటోలు చూసి వీళ్లు ఇంత అందంగా ఉన్నారు. మనం లేము అని ఫీలవుతుంటారు కొంతమంది. ఇదొక మాయ. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఫొటోలకు ఫిల్టర్లు వాడతారు చాలామంది. ముఖానికి మేకప్‌‌ వేసుకుంటారు. ఇవేం లేకుండా కూడా నేచురల్‌‌గా ఉన్నా మనం అందంగానే ఉంటాం. ఆ అందాన్ని మనం ఇష్టపడాలి. దీన్నే ‘సెల్ఫ్‌‌ లవ్‌‌’ అంటాను. మనం ఆడవాళ్లం. సూపర్‌‌ మామ్‌‌. సూపర్‌‌ వుమన్‌‌. సూపర్‌‌ గర్ల్‌‌. మనలా మనం ఉండటమే సూపర్‌‌. బీ ఎ సూపర్‌‌ వుమన్‌‌’’ అంటూ మేకప్‌‌ లేకుండా తీసుకున్న ఫొటోలను, ఎలాంటి ఫిల్టర్స్‌‌ అప్లయ్‌‌ చెయ్యకుండా ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్‌‌ చేసింది సమీరారెడ్డి.

Latest Updates