శంషాబాద్ ఎయిర్ పోర్టును బ్లాస్ట్ చేస్తానన్న వ్యక్తి అరెస్ట్

ఫారిన్ లో చదువుకోవడానికి వెళ్తున్న ఫ్రెండ్ పై కక్ష పెంచుకున్న యువకుడు అతడిని కెనడా ఫ్లైట్ ఎక్కకుండా ఆపాలని స్కెచ్ వేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను బ్లాస్ట్ చేస్తానని ఫేక్ మెయిల్ పోస్ట్ చేశాడు.  మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ఈ బెదిరింపు మెయిల్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను పేల్చివేస్తానని బెదిరించిన ఆకతాయి ఆటకట్టించారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. మంగళవారం బెదిరింపుఈ-–మెయిల్ చేసిన బీటెక్ స్టూడెంట్ ను 10 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్ట్ లో కలకలం సృష్టించిన నిందితుడి వివరాలను బుధవారం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన కాలేరు సాయిరామ్(25) గీతం యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన సాయిరాం పై చదువుల కోసం ఫారిన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇందుకోసం సాయిరాం ఉప్పల్ ఫిర్జాదిగూడలో ఉంటూ ఏడాది కాలంగా కెనడా వీసా కోసం ప్రయత్నం చేశాడు. మొదటి సారి తన వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. మరోసారి వీసా అప్లయ్  చేయడానికి సాయిరాం సిద్ధమయ్యాడు. అందుకోసం అమీర్ పేట్ ఎల్లారెడ్డి గూడలో ఉంటున్న వరంగల్ జిల్లా గణేశ్ నగర్ కు చెందిన కట్రోజు శశికాంత్(24) ఇంటికి వెళ్లాడు.

తన కన్నా ముందే కెనడా వెళ్తున్నాడని

కాలేరు సాయిరామ్ సొంతూరు, శశికాంత్ అమ్మమ్మ వాళ్ల ఊరు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కావడంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉంది. ఎంటెక్ చదువుతున్న శశికాంత్ కి వీసా ప్రాసెస్ పై అవగాహన ఉండడంతో తనకు సహకరించాలని సాయిరామ్ అతడిని కోరాడు. సాయిరామ్ గత నెల 5న శశికాంత్ ఇంటికి వెళ్లాడు. తనతో పాటు తెచ్చిన డాక్యుమెంట్లను పీడీఎఫ్ చేసి రూల్స్ ప్రకారం కెనడా ఇమ్మిగ్రేషన్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. ఇదంతా పక్కనే ఉన్న శశికాంత్ గమనించాడు. తనకంటే ముందే సాయిరామ్ కెనడాకి వెళ్ళడం శశికాంత్ కి ఇష్టం లేదు. ఎలాగైనా సాయిరాంకి వీసా రాకుండా చేయాలనుకున్నాడు. తాను ట్రాప్ చేసిన సాయిరామ్ కెనడా వెబ్ పేజ్ ఆధారంగా కెనడా ఇమ్మిగ్రేషన్ వెబ్ ఫామ్ ను శశికాంత్ మళ్ళీ ఓపెన్ చేశాడు.

సాయిరామ్ అప్లికేషన్ ఐడీతో అసభ్యకర పదజాలాన్ని అందులో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాయిరామ్ ఆగస్టు 20న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు  కంప్లయింట్ చేశాడు.  సైబర్ క్రైమ్ పోలీసులు శశికాంత్ ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. సాయిరామ్ తనపై పోలీసులకు కంప్లయింట్ చేయడంతో శశికాంత్ అతడిపై మరింత కక్ష పెంచుకున్నాడు.  అప్పటికే సాయిరామ్ కెనడా వెళ్ళేందుకు వీసా కన్ ఫార్మ్ అయ్యింది.  వీసా రావడంతో  ఈ నెల 4న బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కెనడా వెళ్లేందుకు సాయిరామ్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శశికాంత్.. సాయిరామ్ ను ఎలాగైనా సరే కెనడా వెళ్ళకుండా ఆపాలని స్కెచ్ వేశాడు. తన వద్ద ఉన్న సాయిరామ్ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తో శంషాబాద్ ఎయిర్ పోర్టు పేజ్/సపోర్ట్ పేజ్ ఓపెన్ చేసి ఎయిర్ పోర్టును బ్లాస్ట్ చేస్తానని ఫేక్ మెసేజ్ పోస్ట్ చేశాడు.

Latest Updates