నేడే తొలి బోనం

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి బోనాల సంబురం మొదలు కానుంది. ఆషాఢ బోనాలు ప్రారంభం కానుండటంతో.. జగదంబిక అమ్మవారి ఆలయం జాతరకు ముస్తాబైంది. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సీసీ కెమెరాలతో నిఘాతో పాటు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరకు  అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. గోల్కొండ కోటలో నెల రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల్లో  ప్రతీ ఆది ,గురువారాల్లో అమ్మవారికి తొమ్మది పూజలు చేస్తారు. భారీగా  భక్తులు వస్తారని అంచనా వేస్తోన్న అధికారులు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ప్లాస్టిక్ ఫ్రీ గోల్కొండ బోనాలు జరిపేందుకు.. క్లాత్ బ్యాగ్స్ , మట్టి గ్లాస్ లను ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట గేట్ నుంచి కోటపై వరకు 5 వాటర్ పాయింట్స్, 3 మెడికల్ సెంటర్స్ భక్తులకు అందుబాటులో ఉంటాయి. దర్శనం కోసం 2 , బోనాల కోసం ఒక క్యూ ఏర్పాటు చేశారు అధికారులు.

మధ్యాహ్నం 12 గంటలకు గోల్కొండ కిలాలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆ తర్వాత తొట్టెల ఊరేగింపు  మొదలవుతుంది. బడా బజార్ పూజారి ఇంటికి తొట్టెల ఊరేగింపు జరిగాక..అమ్మవారికి  ప్రత్యేక పూజలు  చేసి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. బజార్ దర్వాజా దగ్గర పటేలమ్మ అమ్మవారికి సాక సమర్పిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 6గంటల తరువాత తొట్టెల, అమ్మవారి విగ్రహంతో పాటు పటేలమ్మ బోనం కోటకు చేరుకుంటాయి. ఊరేగింపు, బోనాల కోసం అన్ని ఏర్పాట్లు  పూర్తయ్యాయని.. భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు పోలీసులు.

రెండు రోజుల్లో ప్రారంభం కానున్న సికింద్రాబాద్  ఉజ్జయినీ  మహంకాళి  బోనాల  జాతరను  ఘనంగా  నిర్వహిస్తామన్నారు  మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్.  జాతర ఏర్పాట్లపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ నెల  15 లోపు  దేవాలయాలన్నింటికి డబ్బులు  అందజేస్తామన్నారు  మంత్రి.

గోల్కొండ బోనాల జాతరకు వచ్చే భక్తులకు అమ్మవారిని దర్శించుకోవడానికి వారంలో 3 రోజులు ఫ్రీ ఎంట్రీ కల్పించారు ఆలయ అధికారులు. మొదటి పూజకు 50 వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రద్దీ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా  ఆలయానికి వెళ్లే దారిలో 60 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Latest Updates