అగ్రిటెక్‌లో సడెన్‌ బూమ్‌

ఇండియాలోని అగ్రిటెక్‌‌ స్టార్టప్‌‌లు 2019 లో జోరు పెంచాయి.  ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే  పెట్టుబడులు మూడు రెట్లు పెరగడం విశేషం. జూన్‌‌ 2019 దాకా మొత్తం 248 మిలియన్‌‌ డాలర్ల పెట్టుబడులను నింజాకార్ట్‌‌, ఆగ్రోస్టార్‌‌, వేకూల్‌‌, జంబోటెయిల్‌‌, సమున్నతి ఫైనాన్షియల్‌‌ ఇంటర్మీడియేషన్‌‌ వంటి కంపెనీలు ఆకర్షించాయి. సప్లై చెయిన్‌‌ సత్తా పెంచడంపై చాలా కంపెనీలు ఫోకస్‌‌ పెడుతున్నట్లు నాస్కామ్‌‌ తాజా రిపోర్టు చెబుతోంది.

ఇండియాలో మొత్తం 450 అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌ ఉన్నాయి. వాటిలో సగానికిపైగా కంపెనీలు సప్లై చెయిన్‌‌ సత్తాపైనే దృష్టి పెడుతున్నాయి. రైతులకు అవసరమైన సీడ్స్‌‌, ఫెర్టిలైజర్స్‌‌, పెస్టిసైడ్స్‌‌ వంటివి అందుబాటులోకి తేవడంతోపాటు, మార్కెట్‌‌ లింకేజ్‌‌ పైనా ఫోకస్‌‌ చేస్తున్నాయి.  గతంలో స్టార్టప్స్‌‌ ఎక్కువగా బీ టూ సీ ఫోకస్‌‌తో వచ్చేవని, కాలానుగుణంగా ఇప్పుడు బీ టూ బీ స్టార్టప్స్‌‌ ఎక్కువవుతున్నాయని నాస్కామ్‌‌ రిపోర్టు వెల్లడిస్తోంది. ‘అగ్రిటెక్‌‌ ఇన్‌‌ ఇండియా – ఎమర్జింగ్‌‌ ట్రెండ్స్‌‌ ఇన్‌‌ 2019’ పేరిట ఈ రిపోర్టును నాస్కామ్‌‌ విడుదల చేసింది. మేకిన్‌‌ ఇండియా నినాదానికి నిజమైనదిగా నిలిచే రంగం ఇదేననే కారణంతోనే అగ్రిటెక్‌‌ రంగంలో సడెన్‌‌ బూమ్‌‌ వచ్చినట్లు పేర్కొంది.

గ్లోబల్‌‌ మార్కెట్లోకి 25 ఇండియన్ అగ్రిటెక్ స్టార్టప్స్…

25 కి పైగా ఇండియాలోని అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌ ఇప్పటికే గ్లోబల్‌‌ మార్కెట్లో అడుగుపెట్టాయి. కానీ, ఇండియా మార్కెట్లో ప్రవేశించిన గ్లోబల్‌‌ అగ్రిటెక్‌‌ కంపెనీలు అయిదే ఉన్నాయని నాస్కామ్‌‌ రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా 165 మిలియన్‌‌ డాలర్ల పెట్టుబడిని తెచ్చుకోలగింది నింజాకార్ట్‌‌. యూఎస్‌‌ నుంచి అత్యధిక స్థాయిలో పెట్టుబడులు తెచ్చుకున్న ఏకైక ఇండియన్‌‌ స్టార్టప్‌‌గా నింజాకార్ట్‌‌ రికార్డు సృష్టించింది. ఇండియాలోని అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌పై గ్లోబల్‌‌గా ఆసక్తి నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా వరల్డ్‌‌ ఎకనమిక్‌‌ ఫోరమ్‌‌, ఏషియన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ బ్యాంక్‌‌ల దృష్టినీ  ఆకట్టుకోగలుగుతున్నాయి. మార్కెట్‌‌ లింకేజ్‌‌, అగ్రికల్చర్‌‌లో డిజిటలైజేషన్‌‌, ఇన్‌‌పుట్స్‌‌కు మెరుగైన యాక్సెస్‌‌, సాగుకు నిధులు వంటి విభాగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ, అనుభవం పెంచుకుంటున్నాయి ఇండియాలోని అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌.

50 శాతం మందికి ఉపాథి ఈ రంగం నుంచే…

ఇండియాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన విభాగాలన్ని ఇప్పటిదాకా లింకు లేకుండా దేనికది పనిచేస్తుండటమే స్టార్టప్స్‌‌కు పెద్ద వరంగా మారింది. ముఖ్యంగా సప్లైచెయిన్‌‌లోని గ్యాప్స్‌‌ కారణంగా 13 బిలియన్‌‌ డాలర్ల విలువైన పంట దిగుబడిని ఇండియా నష్టపోయినట్లు ఈ నాస్కామ్‌‌ రిపోర్టు ప్రస్తావించింది. ఇండియాలోని వ్యవసాయ రంగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఈ రంగంలోనే అధికం. దేశంలోని 50 శాతం మందికి ఉపాథి కల్పించేది వ్యవసాయ రంగమే. ఐనా, జీడీపీలో ఈ రంగ వాటా కేవలం 18 శాతమే. వ్యవసాయ రంగంలో మానవ వనరుల వినియోగం మెరుగ్గా ఉండేలా సొల్యూషన్స్‌‌ ఆవశ్యకం. దేశపు ప్రాసెస్డ్‌‌ ఫుడ్‌‌ ఎగుమతులు పెరిగేలా చూడటంతోపాటు, నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా చూడటమూ ఈ రంగంలో స్టార్టప్స్‌‌కు  కొత్త అవకాశం కల్పిస్తున్నాయని నాస్కామ్‌‌ రిపోర్టు వివరించింది. వేగంగా వృద్ధి చెందుతున్నా ఇంకా అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌ తమ పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోలేదు. ఏటా 25 శాతం చొప్పున అవి వృద్ధి సాధిస్తున్నాయి. పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని వినియోగించుకోవడానికి కొన్ని అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌కు ఇబ్బందులు  ఎదురవుతున్నాయి.

నిధుల సేకరణే ప్రధాన సవాలు…

ఇండియాలోని అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌కు ప్రధానమైన సవాలు నిధుల సేకరణేనని 40 శాతం స్టార్టప్స్‌‌ అభిప్రాయపడుతున్నాయి. రాబోయే అయిదేళ్లలో తమ విభాగం నుంచి యూనికార్న్‌‌ (బిలియన్‌‌ డాలర్‌‌ వ్యాల్యేయేషన్‌‌) అవతరించే అవకాశం లేదని సగానికిపైగా అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌ సీఈఓలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రంగంలో నిర్మాణాత్మకమైన వృద్ధికి తగిన విధానాలను ప్రభుత్వం తీసుకు రావల్సి ఉందని నాస్కామ్‌‌ తన రిపోర్టులో తెలిపింది. 2 నుంచి 14 మిలియన్‌‌ డాలర్ల మధ్యలో మైక్రో ఫండ్స్‌‌ను నెలకొల్పడం ద్వారా అగ్రిటెక్‌‌ స్టార్టప్స్‌‌కు మరింత ఊపు ఇవ్వచ్చని సూచించింది. డేటా, ఇన్‌‌క్యుబేషన్‌‌ విభాగాలలో పాలసీలు, వేర్‌‌హౌస్‌‌ లైసెన్సింగ్‌‌, పెద్ద ప్రాజెక్టులలో స్టార్టప్స్‌‌ను ఉపయోగించడం వంటి చొరవ కూడా ప్రభుత్వం చూపించాలని  అభిప్రాయపడింది. 2020 నాటికి ఇండియాలోని అగ్రిటెక్‌‌ స్టార్టప్‌‌ కంపెనీల ఇనొవేషన్‌‌ కీలక స్థాయికి చేరుకుని, దేశపు  అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించనున్నాయని పేర్కొంది. ఇందుకోసం తగిన ఇకో సిస్టమ్‌‌ ఏర్పాటులో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని సూచించింది. ముఖ్యంగా ఇనొవేషన్ పెరిగేలా, డేటా కొలాబరేషన్‌‌కు వీలుండేలా, సులభంగా వర్కింగ్‌‌ క్యాపిటల్‌‌ దొరికేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు రియల్‌‌ టైమ్‌‌లో సలహాలు, సూచనలు అందే వెసులుబాటు తెచ్చేలా డిజిటల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటూ కీలకమనేనని నాస్కామ్‌‌ ఈ రిపోర్టు అభిప్రాయపడింది.

Latest Updates