బౌలింగ్‌‌ బలోపేతం కోసమే బౌల్ట్‌‌

ముంబై: స్పీడ్‌‌స్టర్‌‌ బుమ్రా, ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా ఫిట్‌‌నెస్‌‌ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. బౌలింగ్‌‌ బలోపేతం కోసం కివీస్‌‌ పేసర్‌‌ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, ధవల్‌‌ కులకర్ణిని తీసుకున్నామని ముంబై ఇండియన్స్‌‌ క్రికెట్‌‌ డైరెక్టర్‌‌ జహీర్‌‌ ఖాన్‌‌ వెల్లడించాడు. ఐపీఎల్‌‌ ట్రేడింగ్‌‌ విండోలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ నుంచి బౌల్ట్‌‌, రాజస్థాన్‌‌ నుంచి ధవల్‌‌ ముంబైకి బదిలీ అయ్యారు. ‘వచ్చే ఐపీఎల్‌‌ సీజన్‌‌లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. అనుభవజ్ఞులైన కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. గాయాల బెడద వేధిస్తోంది. ఆపరేషన్‌‌ తర్వాత పాండ్యా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. వెన్నునొప్పితో బుమ్రా ఆటకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఈ ఇద్దరి ఫిట్‌‌నెస్‌‌పై సందేహాలు ఉన్నాయి. బెహ్రెన్‌‌డార్ఫ్‌‌ కూడా వెన్నునొప్పితోనే ఇబ్బందిపడుతున్నాడు.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్‌‌ను బలోపేతం చేయాలనుకున్నాం. ట్రేడింగ్‌‌ విండోలో కొంత మందిని తీసుకున్నాం’ అని జహీర్‌‌ వెల్లడించాడు. మొత్తం 18 మందిని రిటేన్‌‌ చేసుకున్న ముంబై.. యువరాజ్‌‌తో సహా 10 మందిని వదిలేసుకుంది. అయితే డిసెంబర్‌‌లో జరిగే వేలంలో ఐదుగురు డొమెస్టిక్‌‌ ప్లేయర్లతో పాటు ఇద్దరు ఇంటర్నేషనల్‌‌ స్టార్స్‌‌ను తీసుకుంటామని జహీర్‌‌ తెలిపాడు. రాబోయే సీజన్‌‌ కోసం వేసుకునే ప్లాన్స్‌‌.. వేలంతో మారిపోతాయని చెప్పిన జహీర్‌‌.. వాటి గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందన్నాడు.

Latest Updates