కాలిన గాయాలతో వాచ్ మెన్ శరణప్ప మృతి.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌ బోయిన్‌‌పల్లి వాచ్‌‌మన్‌‌ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి పెట్రోల్‌‌ బాటిల్‌‌, అగ్గిపెట్టెతో పాటు హత్యకు వాడిన రెండు కార్లు, 6 మొబైల్‌‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు రియల్‌‌ గ్రూపుల మధ్య జరిగిన భూ వివాదంలో ఈ నెల 6న అర్ధరాత్రి వాచ్‌‌మన్‌‌పై నిందితులు పెట్రోల్‌‌ పోసి నిప్పంటించారు. 40 శాతం కాలిన గాయాలతో శుక్రవారం రాత్రి అతను మృతి చెందారు. కేసు వివరాలను సీపీ అంజనీకుమార్‌‌ వెల్లడించారు. వివాదంలో రాజకీయ నేతల ప్రమేయం లేదన్నారు.

అడ్డుకున్నాడని కోపంతో..

బోయిన్‌‌పల్లికి చెందిన తూముకుంట మాధవ రెడ్డి(55), సామల మాధవరెడ్డి(49), పేట్‌‌బషీర్‌‌బాగ్‌‌కు చెందిన జుక్కల సురేందర్‌‌రెడ్డి(50) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్లకు ఓల్డ్ బోయిన్‌‌పల్లి శివ ఎన్‌‌క్లేవ్‌‌లో ఉన్న ప్లాట్ల విషయమై బంజారాహిల్స్‌‌కు చెందిన ప్రకాశ్‌‌రెడ్డితో వివాదం నడుస్తోంది. ఆ స్థలం చుట్టూ ప్రకాశ్‌‌రెడ్డి ఇటీవల ప్రహరీ గోడ కట్టించాడు. కర్నాటకలోని మేధహల్లికి చెందిన శరణప్ప(48) ను, సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్‌‌ను సెక్యూరిటీగా పెట్టారు. ఈ నెల 5న ముగ్గురూ ఎన్‌‌క్లేవ్‌‌కు వచ్చి గోడను కూల్చేశాడు. సెక్యూరిటీగా ఉన్న శ్రీనివాస్‌‌, శరణప్ప అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేశారు. శ్రీనివాస్‌‌ భార్య చిన్న లక్ష్మితో అసభ్యంగా ప్రవర్తించి తోసేశారు. దీంతో మాధవరెడ్డిపై లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మందు తాగి హత్యకు ప్లాన్‌‌

స్థలం వ్యవహారంలో తలదూర్చాడని, తిట్టాడని శరణప్పపై ముగ్గురూ కోపం పెంచుకున్నారు. ఈ నెల 6న ఓ పెళ్లికి వెళ్లిన తూముకుంట మాధవరెడ్డి, సురేందర్‌‌రెడ్డి అక్కడ మందు తాగి శరణప్పను హత్య చేయాలని ప్లాన్‌‌ చేశారు. అవుషాపూర్‌‌లో మాధవరెడ్డి పెట్రోల్‌‌ కొని డ్రైవర్ నగేశ్ సింగ్‌‌తో ఎన్‌‌క్లేవ్‌‌కు వచ్చారు. మాధవరెడ్డి పెట్రోల్ బాటిల్‌‌తో వెళ్లి శరణప్ప నిద్రిస్తున్న రూమ్ డోర్ కొట్టాడు. డోర్ ఓపెన్ చేసిన శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తరువాత అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. నిందితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అరెస్టు చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.

Latest Updates