బాలుడి నరకయాతన : రోజు రోజుకి పెరుగుతున్న నాలుక

వికారాబాద్ : రోజు రోజుకి పెరుగుతున్న నాలుకతో ఓ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. అన్నంతినలేక అనారోగ్యం పాలయ్యాడు. నోట్లో నుంచి బయటికి వచ్చిన నాలుకను ఎంత ట్రై చేసినా లోపలికి పెట్టలేని పరిస్థితి. నీరు, జ్యూస్, జావ లాంటి పదార్థాలనే తీసుకుంటూ జీవనం కడుపుతున్నాడు.

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం క్యాద్గిరకు చెందిన మోహన్‌(12)కు పసితనం నుంచే నాలుక పెరగడం మొదలయింది. నోట్లోంచి బయటికి వచ్చిన నాలుక సైజు ఇంకా పెరుగుతూనే ఉంది. ట్రీట్ మెంట్ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు. రెక్కాడితేగానీ..డొక్కాడని నిరుపేద కుటుంబం బాలుడి తల్లిదండ్రులది. సర్జరీ చేయించే  స్థోమత లేదని డాక్టర్లకు చెప్పారు తల్లిదండ్రులు.

బాలుడి బాధ చూడలేక కొందరు గ్రామస్థులు 1098 చైల్డ్‌ లైన్‌ కు సమాచారం అందించారు. స్పందించిన చైల్డ్‌ లైన్‌ అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకొని, బాలుడిని తహసీల్దార్‌  దగ్గరకు తీసుకెళ్లారు. బాలుడి పరిస్థితిని చూసిన తహసీల్దార్.. ఉన్నతాధికారులకు వివరించి ట్రీట్ మెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సంతోషం తెలిపారు బాలుడి తల్లిదండ్రులు. త్వరలోనే సర్జరీకి ఏర్పాట్లు చేస్తామని డాక్టర్లు చెప్పారని చెప్పుకొచ్చారు.

Latest Updates