నేను చదువుకుంటానని పోలీసులను ఆశ్రయించిన పిల్లోడు

ఎల్లా రెడ్డిపేట, వెలుగు: ‘సారూ.. మా తల్లిదండ్రులు హోటల్లో జీతం ఉంచారు. నాకు చదువుకోవాలని ఉన్నా.. పేదరికంతో చదువుకు దూరమై హోటల్ లో పనిచేస్తున్నాను. నన్ను ఎలాగైనా సర్కార్ బడికి పంపేలా చర్యలు చేపట్టండి’ అంటూ ఓ పిల్లాడు ఎల్లారెడ్డిపేట ఎస్సై అనిల్‌‌‌‌ను మంగళవారం ఆశ్రయిచాడు. వేములవాడ మండలం నెమలి గుండ్లపల్లి గ్రామానికి చెందిన కిరణ్(14) అనే తొమ్మిదో తరగతి చదివే స్టూడెంట్ చదువు మధ్యలో మానేసి ఏడాదిగా ఎల్లా రెడ్డిపేటలోని ఓ హోటల్ లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో..తన కొడుకు కిరణ్ ను హోటల్లో పనికి పెట్టారు.

సదరు బాలుడికి ఇష్టం లేకపోయినా .. బలవంతంగా పనులు చేస్తూ వచ్చాడు. అందరూ స్కూల్ కి వెళ్తుంటే.. నేను మాత్రం పనిలో ఉండడం ఏంటని.. హోటల్ నుంచి విముక్తి పొందాలంటే పోలీసులే దిక్కని భావించి , చివరకు వారిని ఆశ్రయించాడు. ఎస్సై అనిల్ తో మొరపెట్టుకోగా.. మానవతా దృక్పథంతో స్పందించిన ఆయన బాలుడి తల్లిదండ్రులను పిలిపించి, తక్షణమే స్కూల్లో చేర్పించాలని కౌన్సెలింగ్ ఇచ్చి పంపంచారు.

Latest Updates