రిటైర్మెంట్‌ను పక్కనబెట్టిన బ్రావో

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌‌‌‌ మాజీ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో.. రిటైర్మెంట్‌‌ను పక్కనబెట్టేశాడు. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. విండీస్‌‌‌‌ బోర్డులో మార్పులు చోటు చేసుకోవడం వల్లే తాను రిటైర్మెంట్‌‌ను ఉపసంహరించుకున్నాని బ్రావో తెలిపాడు. గతంలో బోర్డు పెద్దలతో గొడవపడి క్రికెట్‌‌కు వీడ్కోలు చెప్పిన బ్రావో.. కొత్త ప్రెసిడెంట్‌‌గా రికీ స్కెరిట్ట్‌‌‌‌ బాధ్యతలు చేపట్టడంతో మనసు మార్చుకున్నాడు. ‘ఇంటర్నేషనల్‌ క్రికెట్‌‌లోకి నేను పునరాగమనం చేయబోతున్నా. నాకు ఇన్నాళ్లూ మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. రిటైర్మెంట్‌‌ను వెనక్కి తీసుకోవడంలో పెద్ద రహస్యం ఏమీ లేదు. అడ్మినిస్ట్రేషన్‌ లెవల్‌‌లో మార్పుల ఫలితమే ఇది. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు జరిగిన మార్పుల వల్ల నా నిర్ణయం కరెక్టేనని తేలింది’ అని బ్రావో వెల్లడించాడు. గతంలో బోర్డు మాజీ ప్రెసిడెంట్‌ డేవ్‌ కామెరాన్‌‌తో గొడవపడిన బ్రావో.. తన కెరీర్‌‌ను నాశనం చేశాడని ఆరోపిస్తూ అనూహ్యంగా 2018లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2016 సెప్టెంబర్‌‌లో విండీస్‌‌‌‌ తరఫున చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌‌లు ఆడిన 36 ఏళ్ల బ్రావో.. 164 వన్డేలు, 66 టీ20లు ఆడాడు.

Latest Updates