బ్రెజిల్‌లో కరోనా డేంజర్‌ బెల్స్‌.. కేసుల్లో ప్ర‌పంచంలో రెండో స్థానం

  • వారంలోనే లక్ష మందికి పైగా సోకిన వైరస్‌ 
  • ఇప్పటికే 3.6 లక్షల కేసులు.. 22 వేల మరణాలు
  • ప్రెసిడెంట్‌ పట్టించుకోవట్లేదని జనం విమర్శలు
  • బోర్సోనారో ఇంకో వైరస్‌ అంటూ గవర్నర్ల మండిపాటు

న్యూఢిల్లీ: దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ దేశం కరోనాకు హాట్‌స్పాట్‌ అవుతోంది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో రెండో ప్లేస్‌కు చేరుకుంది. ఇప్పటివరకు ఇక్కడ 3.6 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క వారంలోనే కేసులు లక్ష దాటాయి. ఆదివారం ఒక్క రోజే 15 వేల మందికిపైగా వైరస్‌ సోకింది. గత 24 గంటల్లో 653 మంది మరణించారు. మొత్తంగా 22 వేల మందికి పైగా చనిపోయారు.

ఏప్రిల్‌, మేల్లో విపరీతంగా..

బ్రెజిల్‌లో ఫిబ్రవరి 25న తొలి కేసు నమోదైంది. మార్చి నెలాఖరరు వరకు రోజుకు 500ల్లోపు కేసులు రికార్డయ్యాయి. ఏప్రిల్‌లో కేసులు పెరిగాయి. తొలి 2 వారాల్లో సగటున రోజుకు వెయ్యి కేసులకు పైనే నమోదవగా మూడో వారంలో రోజుకు 2 వేలొచ్చాయి. చివరి వారంలో కేసులు రోజుకు 4 వేలు దాటాయి. మే తొలి రెండు వారాల్లో రోజుకు యావరేజ్‌గా 5 వేలకు పైగాన నమోదయ్యాయి. మూడో వారంలోనైతే రోజుకు 10 వేలకు తక్కువగా రికార్డవలేదు. గత ఐదారు రోజులుగా 15 వేలకు పైనే కేసులొస్తున్నాయి.

ప్రెసిడెంట్‌ పట్టించుకుంటలేడని విమర్శలు

బ్రెజిల్‌లో సుమారు 70 శాతం మంది వైరస్‌ బారిన పడతారని, తప్పించుకోలేరని ఆ దేశ ప్రెసిడెంట్‌ బోల్సోనారో కామెంట్‌ చేసినట్టు వార్తలొచ్చాయి. హెయిర్‌ డ్రెస్సర్స్‌, జిమ్‌లు అత్యవసరమని, వాటిని తెరవాల్సిందేనని ఇప్పటికే బోల్సోనారో చెప్పారు. కానీ రాష్ట్రాలు దీన్ని పట్టించుకోలేదు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ వద్దని ఫెడరల్‌ సర్కారు నుంచి ఒత్తిడి ఉన్నా గవర్నర్లు తమ రాష్ట్రాల్లో దాన్ని అమలు చేస్తున్నారు. ప్రెసిడెంట్‌ తీరు నచ్చక నెల వ్యవధిలోనే ఇద్దరు వైద్య శాఖ మంత్రులు రాజీనామా కూడా చేశారు. కరోనా విషయంలో ప్రెసిడెంట్‌ తీరుపై చాలా మంది గవర్నర్లు మండిపడ్డారు. ‘బ్రెజిల్‌ జనం రెండు వైరస్‌లను ఎదుర్కొంటున్నారు. ఒకటి కరోనా, రెండోది బోల్సోనారో’ అని సావో పావులో గవర్నర్‌ డోరియా విమర్శించారు. కరోనాతో తప్ప మిగతా అందరితోనూ బోల్సోనారో ఫైట్‌ చేస్తున్నారని మరన్‌హవో గవర్నర్‌ ఫ్లావియో డినో మండిపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఎట్లెట్ల?

= అమెరికాలో ఆదివారం 20 వేలకు పైగా కేసులు రికార్డయ్యాయని జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడిచింది. 633 మంది చనిపోయారంది. యూఎస్‌లో మరణాలు లక్షకు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే 99 వేలు దాటాయి.
= ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లో స్కూళ్లు సోమవారం తెరుచుకున్నాయి. స్కూళ్లలో ఫిజికల్‌ డిస్టెన్స్‌ను కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులు ఆదేశించారు.
= సౌత్‌ కొరియాలో క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో సెల్‌ఫోన్‌ క్యూఆర్‌ కోడ్‌ ల్యాగింగ్‌ సిస్టమ్‌ను వచ్చే నెల నుంచి తీసుకురాబోతున్నారు. ఈ హైరిస్క్‌ ప్రాంతాలకు వచ్చే వాళ్ల వివరాలు పక్కాగా తెలుసుకోవడానికి అక్కడి గవర్నమెంట్‌ ఈ ఏర్పాట్లు చేస్తోంది.
= బ్రెజిల్‌లో గత 14 రోజులుగా ఉన్న వాళ్లెవరైనా రావడానికి అనుమతి లేదని అమెరికా స్పష్టం చేసింది.
= జూన్‌ 1 నుంచి దక్షిణ ఆఫ్రికాలో ఎకానమీని స్టార్ట్‌ చేయనున్నట్టు ప్రెసిడెంట్‌ సిరిల్‌ రామఫోసా వెల్లడించారు.
= న్యూజిలాండ్‌లో జూన్‌ 22 తర్వాత డొమెస్టిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, గ్యాదరింగ్స్‌కు ఆంక్షలు ఉండవని ఆ దేశ ప్రధాని జసిండా వెల్లడించారు.
= యూరప్‌లో జూన్‌లో ర్యాపిడ్‌ కరోనా సలైవా టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా గంటలోనే రిజల్ట్‌ తెలిసిపోతుంది.
= రష్యాలో ఆదివారం 8,946 మందికి వైరస్‌ సోకింది. కేసుల్లో ప్రపచంలో మూడో ప్లేస్‌లో రష్యా ఉంది.
= జపాన్‌లో సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీని తొలగించనున్నారు. ఆ దేశ ప్రధాని షింజో అబే ఈ విషయం వెల్లడించారు.

Brazil, world No. 2 coronavirus hotspot, suffers 653 new deaths

Latest Updates