చిప్స్​ తిని చూపు పోగొట్టుకున్నడు

  •          సరైన పోషకాలు అందక విటమిన్​ బీ12 లోపం, రక్తహీనత
  •         బ్రిటన్​లో అరుదైన కేసు.. జాగ్రత్తగా ఉండాలంటున్న సైంటిస్టులు

అప్పుడప్పుడు చిప్స్​, ఫ్రెంచ్​ ఫ్రైస్​ను టైంపాస్​కు తింటూ ఉంటాం. కానీ, ఆ చిరుతిండే అసలు తిండైతే ఏమైతది. ఇదిగో ఆ పిల్లాడిలా కంటి చూపు పోతది. అవును, బ్రిటన్​కు చెందిన ఓ యువకుడు ఏడేళ్ల పాటు వేరే ఏ తిండీ తినకుండా కేవలం చిప్స్​, ఫ్రెంచ్​ ఫ్రైస్​, తెల్ల బ్రెడ్డు, పంది మాంసం ముక్కల్నే తినడంతో కంటి చూపు పోయింది. అందుకు కారణం సరైన పోషకాలు ఒంటికి అందకపోవడమే. ఈ అరుదైన కేసుపై బ్రిటన్​లోని యూనివర్సిటీ ఆఫ్​ బ్రిస్టల్​ సైంటిస్టులు స్టడీ చేశారు. వాటిని తినడం వల్లే ఎందుకు కళ్లు పోయాయో తెలుసుకున్నారు. అవి మాత్రమే తినడం వల్ల విటమిన్​ బీ12 లోపం ఏర్పడి రక్తహీనత వచ్చిందని తేల్చారు. ఎలిమెంటరీ స్కూల్​ నుంచి తాను ఆ ఫుడ్డునే తింటున్నానని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. తొలిసారిగా 14 ఏళ్ల వయసులో డాక్టర్​ను కలిశాడు. అప్పుడు అతడిలో ఎలాంటి పోషకాహార లోపం కనిపించలేదు. బీఎంఐ (శరీర తూకం) కూడా మామూలుగానే ఉంది. రక్తహీనత ఉందని గుర్తించారు. దీంతో కేవలం బీ12 ఇంజెక్షన్లు, మంచి ఫుడ్డును ఇస్తూ చికిత్స చేశారు. కానీ, ఏడాది తిరిగే సరికి అతడి చెవులు పాడయ్యాయి. ఏదీ వినిపించేది కాదు. చిన్నచిన్నగా చూపుపై ఎఫెక్ట్​ మొదలైంది. అయితే, కారణం మాత్రం డాక్టర్లకు అంతుబట్టలేదు. 17 ఏళ్లు వచ్చేసరికి అతడి చూపు మరింత క్షీణించింది. విటమిన్​ బీ12, సెలీనియం తక్కువగా ఉండడం, జింక్​ ఎక్కువగా ఉండడం, విటమిన్​ డీ లోపంతో ఎముకలు బలహీనంగా ఉండడాన్ని సైంటిస్టులు గుర్తించారు. అది మరింత ముదిరి కంటిపై తీవ్రమైన ప్రభావం చూపించింది. చూపు పోయింది. సరైన పోషకాహారం అందక కంటి చూపుకు ప్రధానమైన నరం (ఆప్టిక్​ నర్వ్​) దెబ్బతినడమే అందుకు కారణమని బ్రిస్టల్​ మెడికల్​స్కూల్​, బ్రిస్టల్​ ఐ హాస్పిటల్​ డాక్టర్లు తేల్చారు. దీన్నే న్యూట్రిషనల్​ ఆప్టిక్​ న్యూరోపతి అని సైంటిఫిక్​గా పిలుస్తున్నారు. ముందుగానే గుర్తిస్తే ట్రీట్​మెంట్​తో దాన్ని నయం చేయొచ్చని, లేట్​ అయితే ఏం చేయలేమని తేల్చి చెబుతున్నారు డాక్టర్లు. ఆప్టిక్​ న్యూరోపతికి ప్రధాన కారణం విటమిన్​ బీ 12 లోపమేనని లండన్​ కింగ్స్​ కాలేజీ న్యూట్రిషన్​ అండ్​ డైటీటిక్స్​ ప్రొఫెసర్​ చెప్పారు. అయితే, బీ12 ఎక్కువగా ఉండే జంతు మాంసం తిన్నా కూడా ఈ లోపం రావడం కొంచెం ఆశ్చర్యపరిచేదేనని అన్నారు. కాబట్టి ఇలాంటి చిరు తిండ్లు తిన్నా కూడా శరీరానికి పోషకాలందించే ఆహారాన్నీ తప్పనిసరిగా తీసుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Latest Updates