వాస్తు బాలేదని.. మళ్లా రిపేర్లు

బీఆర్కే భవన్ లో ఓ పెద్దాఫీసర్ చాంబర్​కు రెనోవేషన్

హైదరాబాద్, వెలుగు:  బీఆర్కే భవన్ లో మళ్లా రిపేర్లు షురువైనయి. ఆగస్టులో పాత సెక్రటేరియెట్ నుంచి బీఆర్కే భవన్ కు శాఖల షిప్టింగ్ చేయడానికి ముందు బీఆర్కే భవన్ కు సుమారు రూ.10 కోట్ల ఖర్చుతో రిపేర్లు చేశారు. ఇక్కడి నుంచి అక్టోబర్ లో పూర్తి స్థాయి పాలన కూడా మొదలైంది. కానీ రెండు నెలలకే మళ్లీ రిపేర్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల చాంబర్లు సిద్ధం కాకపోవటంతో సిటీలోని వారి శాఖల కార్యాలయాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి ఫ్లోర్ లో మంత్రుల చాంబర్ల పనులు సైతం నిదానంగా జరుగుతున్నాయి. ఇప్పటికి ఇద్దరు మంత్రుల చాంబర్లు సిద్ధమయ్యాయి. మిగతా మంత్రుల చాంబర్లు రెడీ అవుతున్నాయి.

వాస్తు మంచిగ లేక సమస్యలొస్తున్నయట

ఒక కీలక శాఖకు చెందిన ఉన్నతాధికారి చాంబర్ ను ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆధునీకరించారు. ఈ రెండు నెలల్లో వాస్తు సమస్య వల్ల పలు ఇబ్బందులు వచ్చినట్లు తన శాఖలోని అధికారులతో సదరు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చాంబర్ వాస్తు అనుకూలంగా లేకపోవటంతో ఇటీవల హైకోర్టు ఓ కేసు విషయంలో అక్షింతలు వేయటంతో పాటు సీరియస్ అయిందని ఉద్యోగులతో ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చాంబర్ మొత్తాన్ని మళ్లీ రెనోవేషన్ చేస్తున్నరు. త్వరలో పనులు స్టార్ట్ కానున్నాయి. కొత్తగా మార్పులు చేసేందుకు రూ.60 లక్షలు అవుతాయని అంటున్నా, పనులు పూర్తయ్యే సరికి ఖర్చు కోటికి చేరుతుందని చెప్తున్నారు.

చక్రం తిప్పుతున్న పెద్దాఫీసర్ భార్య

రెనోవేషన్ జరుగుతున్న చాంబర్ ఉన్నతాధికారి భార్య స్వయనా ఇంటీరియర్ డిజైనర్ అని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. పాత సెక్రటేరియెట్ లో కూడా సుమారు రూ.18 కోట్ల ఖర్చుతో రెనోవేషన్ కాంట్రాక్టు పనులు ఉన్నతాధికారి భార్య కనుసన్నల్లోనే జరిగాయని అంటున్నారు. బీఆర్కే భవన్ లో సెప్టెంబర్ నాటి రిపేర్లు, ఇప్పుడు జరుగుతున్న రెనోవేషన్ లోనూ ఆమె అంతా తానే అయి పనులు చేయిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే, బీఆర్కే భవన్ లో షిఫ్టింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచీ రెనోవేషన్ విషయంలో అన్ని శాఖలకు సమానంగా పైసలిస్తలేరన్న విమర్శలు వినపడుతున్నాయి. కొన్ని శాఖల చాంబర్లు, ఉద్యోగులు విధులు నిర్వర్తించే గదులు సరిగ్గా లేవని చెబుతున్నారు. కేవలం కొన్ని శాఖలకు, ఆ శాఖల పెద్దాఫీసర్ల చాంబర్లకు మాత్రం భారీగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates