ఔను కార్వీ తప్పు చేసింది..సెబీ ఛైర్మన్ త్యాగి

ముంబైఅనుమతి లేని పనులనే కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ చేసిందని సెబీ ఛైర్మన్‌‌ త్యాగి బుధవారం స్పష్టం చేశారు. క్లయింట్ల షేర్లను తాకట్టు పెట్టి, సొంత అవసరాలకు ఆ డబ్బును వాడుకుంటోందనే ఆరోపణలపై కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌పై సెబీ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని కూడా కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ను సెబీ నిర్దేశించింది. క్లయింట్ల షేర్లను వాడుకోవడానికి ఎప్పుడూ వీలు లేదని, ఇదే విషయాన్ని సెబీ స్పష్టంగా చెప్పిందని త్యాగి పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనలను కార్వీ ఉల్లంఘించిందని చెప్పారు. ఆర్గనైజేషన్‌‌ ఫర్‌‌ ఎకనమిక్‌‌ కో–ఆపరేషన్‌‌ అండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ (ఓఈసీడీ) ఇక్కడ నిర్వహించిన ఆసియన్‌‌ రౌండ్‌‌ టేబుల్‌‌లో  పాల్గొన్న త్యాగి, మీడియాతో మాట్లాడారు. క్లయింట్ల షేర్లను కుదువ పెట్టడానికి నిబంధనలు ఏ రోజూ అంగీకరించలేదని, రూల్స్‌‌లో ఒకవేళ కొంత అస్పష్టత ఉన్నప్పటికీ సొంత అవసరాల కోసం క్లయింట్ల షేర్లను తనఖా పెట్టడం నైతికంగా తప్పని చెప్పారు. ప్రొప్రైటరీ ట్రేడ్స్‌‌, ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ నిబంధనల ప్రకారం చేయడానికి వీలు లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని అంగీకరించలేమన్నారు. కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ నిబంధనలను ఉల్లంఘించి, క్లయింట్ల షేర్లను తాకట్టు పెట్టిందని చెబుతూ నేషనల్‌‌ స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఈ) రిపోర్టు ఇవ్వడంతో కిందటి వారంలో  ఆ కంపెనీపై చర్యలను తీసుకుంది సెబీ. కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ (కేఎస్‌‌బీఎల్‌‌) కార్యకలాపాలను ఈ ఏడాది ఆగస్టులో ఎన్‌‌ఎస్‌‌ఈ తనిఖీ చేసింది. జనవరి 1 నుంచి జరిగిన లావాదేవీలను ఎన్‌‌ఎస్‌‌ఈ ఈ సందర్భంగా పరిశీలించినట్లు సెబీ తన ఉత్తర్వులలో పేర్కొంది. క్లయింట్లు ఇచ్చిన పవర్‌‌ ఆఫ్‌‌ అటార్నీ ఆధారంగా షేర్లు బదిలీ చేయమని కార్వీ కోరినా, ఆ విధంగా చేయవద్దని ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌, సీడీఎస్‌‌ఎల్‌‌లను సెబీ ఆదేశించింది. కేఎస్‌‌బీఎల్‌‌ క్లయింట్ల డిపాజిటరీలలో షేర్ల కదలికలపై ఓ కన్నేయమని కూడా వాటిని సెబీ నిర్దేశించింది.

బ్యాంక్‌‌లు బ్రోకింగ్ వైపు కస్టమర్ల మొగ్గు…

కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ సంక్షోభంలో పడటంతో క్లయింట్లు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ప్రైవేటు రంగంలోని ఇతర బ్రోకింగ్‌‌ కంపెనీల పట్లా క్లయింట్లు కొంత విముఖత చూపిస్తున్నట్లు మార్కెట్‌‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రొప్రైటరీ ట్రేడింగ్‌‌, క్లయింట్ల షేర్లను పూల్‌‌ ఎకౌంట్లో పెట్టి, వాటిని సొంత అవసరాలకు వాడుకుంటుండమే దీనికి కారణమని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో క్లయింట్లలో కొంత భయం చోటు చేసుకుందని, దాంతో పెద్ద పెద్ద బ్యాంకుల అధీనంలోని బ్రోకింగ్‌‌ కంపెనీల వైపు మళ్లాలని చాలా మంది కస్టమర్లు ఆలోచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌కు కస్టమర్లున్నారు.

కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌ తాకట్టు పెట్టిన షేర్ల మీద అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు తల పట్టుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్వీ ఆ పని చేసినట్లు సెబీ తేల్చడంతో, తమ అప్పుల పరిస్థితి ఏమిటని దిగులుపడుతున్నాయి. ఇలా బ్యాంకులు అప్పులు ఇచ్చిన విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లాలని సెబీ భావిస్తోంది. అప్పుల కోసం క్లయింట్ల షేర్లను తాకట్టు పెడుతుంటే, బ్యాంకులు ఎలా అంగీకరించాయని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. క్లయింట్ల డబ్బులు, షేర్లను వేరు వేరుగా చూడాలని ఈ ఏడాది జూన్‌‌లోనే  బ్రోకింగ్‌‌ కంపెనీలకు స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసినట్లు సెబీ చెబుతోంది. షేర్లకు క్లయింట్లు  పాక్షిక చెల్లింపులనే జరిపినప్పటికీ, వాటిని తనఖా పెట్టడానికి వీలు లేదని బ్రోకింగ్‌‌ కంపెనీలకు తెలిపినట్లు సెబీ పేర్కొంటోంది.

రూ.600 కోట్ల అప్పు కోసం షేర్లు తనఖా

95 వేల మంది కస్టమర్లకు చెందిన రూ. 2,300 కోట్ల విలువైన షేర్లను  తన గ్రూప్‌‌లోని రియాల్టీ కంపెనీకి రూ. 600 కోట్ల అప్పు కోసం కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌  తనఖా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర బ్రోకింగ్‌‌ కంపెనీల క్లయింట్ల పొజిషన్స్‌‌నూ సెబీ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రూ. 2 వేల కోట్లను  క్లయింట్లకు చెల్లించడంలో విఫలమవడంతో కార్వీ స్టాక్‌‌ బ్రోకింగ్‌‌ లిమిటెడ్‌‌పై సెబీ ఇప్పటికే ఆంక్షలు విధించింది. క్లయింట్లు ఇచ్చిన పవర్‌‌ ఆఫ్‌‌ అటార్నీ అధికారాన్ని  కార్వీ దుర్వినియోగపరిచిందని, అక్రమంగా రూ. 1,096 కోట్లను రియాల్టీకి మళ్లించిందని కూడా సెబీ దర్యాప్తులో తేలింది.

Latest Updates