క‌రోనా చికిత్స పొందుతూ.. 35 ఏళ్ల బీఎస్ఎఫ్ జ‌వాన్ మృతి

క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జ‌వాన్ వినోద్ కుమార్ ప్ర‌సాద్ (35) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని బీఎస్ఎఫ్ సీనియ‌ర్ అధికారులు తెలిపారు. బీపీ, షుగ‌ర్, ఇత‌ర దీర్ఘ‌కాల వ్యాధులు లాంటి ఏ కోమార్బిడ్ కండిష‌న్స్ లేని ఆ యువ సైనికుడు కొన్నాళ్లుగా ఢిల్లీ శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విధులు నిర్వ‌హిస్తున్నాడ‌ని చెప్పారు. అయితే జూన్ 5న అత‌డికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిట‌ల్ లో చేర్పించిన‌ట్లు తెలిపారు. అక్క‌డ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడ‌న్నారు. ఈ సైనికుడి మృతితో ఇప్ప‌టి వ‌ర‌కు బీఎస్ఎఫ్ లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మూడుకు చేరిన‌ట్లు చెప్పారు. అన్ని సెంట్ర‌ల్ ఆర్డ్మ్ పోలీస్ ఫోర్సెస్ లో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయార‌న్నారు.

షేప్ -1 కేట‌గిరీలో ఉన్న జ‌వాన్..

దేశ రాజ‌ధానిలో ఢిల్లీ పోలీసుల‌తో క‌లిసి శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ డ్యూటీలో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ ప్ర‌సాద్ షేప్ – 1 కేట‌గిరీ జ‌వాన్ అని బీఎస్ఎఫ్ అధికార ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు. షేప్ – 1 కేట‌గిరీ అంటే ఆరోగ్యం, ఫిట్ నెస్ ప‌రంగా అత్యుత్త‌మ కేట‌గిరీ అన్నారు. అలాగే వినోద్ కు ఎటువంటి కోమార్బిడ్ కండిష‌న్స్ కూడా లేవ‌ని చెప్పారు. అయితే వినోద్ కు తొలుత జూన్ 5న ద‌గ్గు, నీర‌సంగా అనిపించ‌డంతో ఢిల్లీ ఎయిమ్స్ కు త‌ర‌లించామ‌ని, అక్క‌డ వైద్యులు శాంపిల్స్ సేక‌రించి క‌రోనా టెస్టుకు పంపార‌ని తెలిపారు. “జూన్ 6న వ‌చ్చిన రిపోర్టులో వినోద్ కు క‌రోనా నెగ‌టివ్ అని చెప్పారు. కానీ ఆ త‌ర్వాత కూడా అత‌డి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో జూన్ 8న డాక్ట‌ర్లు ఐసీయూకు త‌ర‌లించారు. అదే రోజున మ‌రోసారి క‌రోనా టెస్టు చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చింద‌ని చెప్పారు. జూన్ 9 నాడు వినోద్ తుది శ్వాస విడిచాడని డాక్ట‌ర్లు చెప్పారు” అని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో చ‌నిపోయిన కేంద్ర బ‌ల‌గాల‌కు చెందిన వారిలో వినోద్ అతి చిన్న వ‌య‌స్కుడ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు అంతా 45 ఏళ్ల‌కు పైబ‌డిన వాళ్లేన‌ని చెప్పారు. ఈ జ‌వాన్ మృతి ప‌ట్ల అత‌డి కుటుంబానికి బీఎస్ఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ నుంచి అన్ని స్థాయిల్లోని అధికారులు సానుభూతి తెలిపార‌న్నారు. ఆ జ‌వాను కుటుంబానికి బీఎస్ఎఫ్ అండగా ఉంటుంద‌ని చెప్పారు.

కాగా, రెండున్న‌ర ల‌క్ష‌ల మంది సైనిక‌ బ‌లగం కూడిన బీఎస్ఎఫ్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లో నిరంతంర ప‌హారా కాస్తూ భార‌త్ ను కాపాడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 535 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్లకు క‌రోనా సోక‌గా.. 435 మంది పూర్తిగా కోలుకున్నారు. ముగ్గురు జ‌వాన్లు క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు వ‌దిలారు. వినోద్ మృతితో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది కేంద్ర బ‌ల‌గాల సైనికులు మ‌ర‌ణించారు. సీఐఎస్ఎఫ్ లో ఐదుగురు, సీఆర్పీఎఫ్ లో న‌లుగురు, బీఎస్ఎఫ్ లో ముగ్గురు, స‌హ‌స్త్ర సీమా బ‌ల్, ఐటీబీపీలో ఒక్కొక్క‌రు చొప్పున క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

Latest Updates